చిక్కుల్లో అమెరికా ఉపాధ్యక్షుడు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందన్న ఆరోపణలపై దర్యాప్తు వేగవంతం చేసింది ఎఫ్‌బీఐ. అప్పటి రష్యా అధికారులతో కుమ్మక్కైన రిపబ్లికన్‌  నేతలను ఒక్కొక్కరిని విచారించేందుకు చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే డొనాల్డ్‌ ట్రంప్‌ మాజీ భద్రతా సలహాదారుడిని అదుపులోకి తీసుకున్న ఎఫ్‌బీఐ.. తాజాగా వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌ ను సైతం విచారించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. మైఖేల్ ఫ్లిన్‌ ఇచ్చిన సమాచారం మేరకు.. పెన్స్‌ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తోంది. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ రాబర్ట్ ముల్లర్ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్న విచారణ బృందం.. త్వరలో మైక్‌ పెన్స్‌ కు సైతం నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అమెరికా మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. ఐతే..విచారణ నుంచి తప్పించుకునేందుకు  పెన్స్‌ రాబర్ట్‌ ముల్లర్‌ పై ఒత్తిడి చేస్తున్నట్లు సీఎన్‌ఎన్‌ ఆరోపించింది.

మైక్ పెన్స్ పై వచ్చిన ఆరోపనలను వైట్‌ హౌస్‌ కొట్టిపారేసింది. ఈ కేసులో పెన్స్‌ జోక్యం ఏమీ లేదని, ఇప్పటి వరకు ఎఫ్‌బీఐ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని తెల్పింది. మైక్ పెన్స్ దృష్టంతా పన్నుల సంస్కరణల బిల్లుపైనే ఉందని ఆయన మీడియా కార్యదర్శి ఎలిస్సా ఫరాహ్‌ వివరణ ఇచ్చారు. ఒకవేళ ఎఫ్‌బీఐ నోటీసులు జారీ చేసినా.. విచారణకు ఆయన సిద్దంగా ఉన్నారని చెప్పారు.

అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించేందుకు రష్యాతో చేతులు కలిపారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ ప్రారంభించిన ఎఫ్‌బీఐ..గతవారం ట్రంప్‌ మాజీ భద్రతా సలహాదారుడిని అరెస్టు చేసింది. వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టుకు హాజరైన మైఖెల్‌ ఫ్లిన్‌..తాను ఉద్దేశ్యపూర్వకంగానే తప్పు చేసినట్లు నేరం అంగీకరించాడు. అప్పటి రష్యా రాయబారి సెర్గీ కిస్లాయక్‌తో సంభాషణలకు సంబంధించి ఎఫ్‌బీఐకి తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు.