ఘనంగా ప్రజెంటేషన్ ఆఫ్ కలర్స్ ఉత్సవాలు

భారత నౌకాదళంలోకి తొలి జలాంతర్గామి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో ప్రజెంటేషన్ ఆఫ్ కలర్స్ పేరుతో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటూ గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. భారతీయ నౌకాదళంలో 1967 డిసెంబర్‌ 8న జలాంతర్గామి విభాగం ప్రారంభమవగా…తొలి జలాంతర్గామిగా ఐఎన్ఎస్ కల్వరిని ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమంలో నౌకదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ మాట్లాడుతూ.. నౌకాయానంలో భారత్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ నౌకాయాన రంగంపై ఆధారపడి ఉందని తెలిపారు. 90 శాతం వర్తకమంతా నౌకాయానం ద్వారానే జరుగుతుందని చెప్పారు. జలాంతర్గాముల విభాగం నౌకాదళంలో అత్యంత శక్తివంతమైందిగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. శత్రు భయంకరంగా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నానని రామ్‌నాథ్ చెప్పారు.