గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెర

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ ప్రచారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు బీజేపీ తరఫున ప్రధాని మోడీ, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనతో తొలి దశ ఎన్నికలు జరిగే ప్రాంతాలను చుట్టేశారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దును సమర్ధించుకోవడంతో పాటు, గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రచారం నిర్వహించారు.

ఇక, ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ రాహుల్ ఎన్నికల ప్రచారం సాగింది. జీఎస్టీతో వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను గుర్తు చేస్తూ ఆయన ప్రచారంలో దూసుకుపోయారు. అంతేకాదు, పెద్ద నోట్ల రద్దు సమయంలో చిన్న వ్యాపారులు, ప్రజలు పడ్డ బాధలను గుర్తు చేశారు. మరోవైపు, పాటిదార్ వర్గాన్ని ఆకర్షించేందుకు హార్ధిక్ పటేల్ రంగంలోకి దిగి కాంగ్రెస్ కు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు.

శనివారం జరగనున్న పోలింగ్ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 182 అసెంబ్లీ సీట్లకు గాను తొలిదశలో 89 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనున్నది. గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతంలో ఓఖీ తుఫాన్ వల్ల అటు ప్రధాని, ఇటు రాహుల్ ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకున్నారు.