క్లినికల్ ట్రయల్స్ కు బలి కావద్దు

డబ్బులకు ఆశపడి యువత ఆరోగ్యం పాడుచేసుకోవద్దని, విలువైన ప్రాణాలను ఔషధ పరీక్షలకు బలి చేసుకోవద్దని మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొంటున్నారని, ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నవారు తమ పేర్లు చెబితే ఆరోగ్య పరీక్షలు చేయించి, వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. వారికి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేస్తామని, స్వయం ఉపాధి కోసం రుణాలు ఇప్పిస్తామన్నారు. కరీంనగర్ జిల్లాలో క్లినికల్ ట్రయల్స్ బాధితులు బయటపడుతున్న నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

క్లినికల్ ట్రయల్స్ అంశం రాష్ట్ర పరిధిలో లేనప్పటికీ జరిగిన ఘటనలపై ఎప్పటికప్పుడు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు తెలియజేస్తున్నామని మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన నాగరాజు ఈ ఏడాది జూన్ 2న చనిపోయాడని, ఆ తర్వాత మరో మూడు కేసులు బయటకు వచ్చాయని వివరించారు. వీరిలో భోగ సురేశ్ రక్తం కక్కుకోవడం అబద్దమని బాధితుడే ఇవాళ చెప్పాడని తెలిపారు.

క్లినికల్ ట్రయల్స్ అంశం డీసీజీఐ పరిధిలో ఉండేది అయినప్పటికీ నాగరాజు మృతి తర్వాత జస్టిస్ గోపాల్ రెడ్డి, డీఐజీ, నిమ్స్ డైరెక్టర్ పాటు మరో ఇద్దరితో కమిటి వేశామని మంత్రి గుర్తుచేశారు. కమిటీ రికమండేషన్స్ వచ్చినంక డీసీజీఐకి పంపిస్తామన్నారు.
డీసీజీఐ, ఎథిక్స్ కమిటీ కూడా జరిగిన సంఘటనలపై విచారణ జరుపుతోందన్నారు. నివేదికలు వచ్చినంక కంపెనీలది తప్పని తేలితే రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నాగరాజుపై క్లినికల్ ట్రయల్స్ జరిపిన లోటస్ సంస్థపై ఇప్పటికే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశామని గుర్తుచేశారు.