కోహ్లీకి మానుషి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్!

సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2017 అవార్డుల కార్యక్రమంలో కోహ్లిని మిస్ వరల్డ్ మానుషి చిల్లార్ ఓ ఆసక్తికర ప్రశ్న అడిగింది. “మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకరు. మీరు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకు తగినట్లే మీరు సమాజానికి తిరిగిచ్చారు. అయితే మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అవుతున్న యువతకు ముఖ్యంగా క్రికెట్ ప్రపంచంలో ఏమి తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు” అని ప్రశ్నించింది. దీనికి టీమిండియా కెప్టెన్ చాలా సుదీర్ఘంగానే బదులిచ్చాడు. “ప్రతి మనిషి తనలాగే ఉండాలని, మరొకరిని చూసి ఏదో చేయడానికి ప్రయత్నిస్తే.. ఎప్పటికీ సక్సెస్ కాలేడని కోహ్లి చెప్పాడు. నేను ఎప్పుడూ నాలాగే ఉంటాను. చాలా మందికి నేనిలా ఉండటం నచ్చదు. కానీ నేను అవన్నీ పట్టించుకోను. నేను మారాలి అని ఒక్కసారి అనిపించింది. అప్పుడు మారిపోయాను. ప్రతి వ్యక్తి తమ గుర్తింపును, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. అన్నీ మనమే చేయలేం. టీమ్‌లో ప్రతి ఒక్కరికీ ఎవరి ప్రణాళికలు వారికి ఉంటాయి. వాళ్లపై మనం నమ్మకం ఉంచాలి. అందుకు తగిన పరిస్థితులు కల్పించాలి. మనం కష్టపడి పనిచేస్తూ, మనకు మనం నిజాయితీగా ఉండగలిగితే చాలు” అని కోహ్లి అన్నాడు.