కోదండరాం రాజకీయ దళారి

కోదండరాం రాజకీయ దళారిగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీలకు కొమ్ము కాస్తూ, వారి ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలతో చేసుకున్న ఒప్పందం ఏంటో కోదండరాం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌పై ఉద్దేశపూర్వకంగానే కోదండరాం దుష్ర్పచారం చేస్తున్నారని గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోడీ ఇంతవరకు ఇవ్వకున్నా ప్రశ్నించని కోదండరాం, హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కష్టపడి చదువుకుంటుంటే కోదండరాం వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.  నిరుద్యోగులకు కోదండరాం క్షమాపణ చెప్పాలన్నారు. కోదండరాం కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.