విద్యుత్ రంగంలో అగ్రగామి తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం 2021 కల్లా అందరికి విద్యుత్ అనే లక్ష్యం పెట్టుకోగా, తెలంగాణ రాష్ట్రం 2018లోనే ఆ లక్ష్యాన్ని చేరుకొని తొలి వరుసలో నిలవనున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఇతర అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. విద్యుత్ మరియు కొత్త ఉత్పాదక శక్తి అంశంపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్న సదస్సులో ఆయన పాల్గొన్నారు.

వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తిపై, పునరుత్పాదక విద్యుత్, విద్యుత్ తయారీ ప్రధాన అంశాలుగా చర్చించామని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందన్నారు. 2014 లో రాష్ట్ర ఏర్పాటు నాటికి విద్యుత్ వస్తుందో లేదో అనే భయంలో ప్రజలు ఉండేవారని, అయితే ఎవరి అంచనాలకు అందకుండా అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు 24 గంటల విద్యుత్ అందించే మొదటి రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ ఆవిర్భవించనున్నదన్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే జనవరి 1 నుంచి రాష్ట్రంలో 25 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయదారులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయబోతున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. దేశంలో తొలిసారి రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ నిర్ణయం తీసుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవనున్నదని చెప్పారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగానికి భరోసానిచ్చేలా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని మంత్రి అన్నారు. ఇరిగేషన్, రైతు రుణమాఫి, వ్యవసాయానికి పెట్టుబడి అందిస్తున్నారని, వీటన్నింటికి మించి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అంశాన్ని కీలకంగా సీఎం కేసీఆర్ తీసుకురానున్నారని వివరించారు. ప్రస్తుతం పగటిపూట 9 గంటలు వ్యవసాయ రంగానికి విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

ఈ సదస్సులో పలు రాష్ట్రాల మంత్రులు, కార్యదర్శులు, తెలంగాణ నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి, కార్యదర్శి అజయ్ మిశ్రా హాజరయ్యారు.