కులాంతర వివాహాలకు మరింత ఆర్థికసాయం 

దేశంలో కులాంతర వివాహాలకు పెద్దపీట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దళితులను వివాహం చేసుకొనే వారికి రూ.2.5 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలో వధువు, వరుడిలో ఎవరో ఒకరు దళిత వర్గానికి చెందినవారై ఉండాలని తెలిపింది. ఆ దంపతుల వార్షిక ఆదాయం రూ.5లక్షలకు పైబడి ఉండరాదనే నిబంధనను కేంద్రం తొలగించింది. అంతేకాకుండా ఈ డబ్బును రెండు విడతలుగా వారికి అందజేయనుంది. ఈ పథకం ప్రకారం వధువు, వరుడి వార్షికాదాయంతో సంబంధం లేకుండా ప్రోత్సాహకం ఇవ్వాలని సామాజిక న్యాయం- సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకొనే వధూవరులకు మొత్తాన్ని జమచేయడానికి ఉన్న విధివిధానాలను సవరించింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నియమం ప్రకారం.. కులాంతర వివాహం చేసుకున్న వధూవరుల అభ్యర్థనను అంబేడ్కర్‌ ఫౌండేషన్‌ క్లియర్‌ చేసిన తర్వాత వారికి రూ.1.5లక్షలు అందజేయనున్నారు. మిగతా రూ. లక్షను వారిద్దరి పేరుతో తెరిచిన బ్యాంకు ఉమ్మడి ఖాతాలో జమచేస్తారు. ఆ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత వారు తీసుకోవచ్చు. 2013లో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు ప్రభుత్వం పెద్దఎత్తున యువతీయువకులు ఆకర్షితులవుతారని భావించింది. కానీ దేశవ్యాప్తంగా ఈ పథకం అమలుపై అనేకమందికి తెలియదు. సమాచారలోపంతో అర్హులైన వారు దరఖాస్తు చేయడం లేదు. గత మూడేళ్లలో 116 జంటలు మాత్రమే ఈ డబ్బును తీసుకున్నాయి.  ఈ పథకానికి ఓ మోస్తరు స్పందన వస్తుండంతో ఆదాయ పరిమితిని తొలగించినట్టు  సమాచారం.