కులభూషణ్ ను కలిసేందుకు తల్లి, భార్యకు అనుమతి

గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కులభూషణ్ జాదవ్ కు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తీసుకువచ్చిన ఒత్తిడితో పాకిస్తాన్ దిగి వచ్చింది. ఈ నెల 25న తల్లితో పాటు ఆయన భార్యను కలిసేందుకు కులభూషణ్ జాదవ్ కు అనుమతినిచ్చింది. జైల్లోనే వారిద్దరితో మాట్లాడేందుకు కులభూషణ్ కు అవకాశం కల్పించనున్నారు. కులభూషణ్ తల్లి, భార్యకు వీసా ఇచ్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించిందని, ఈ విషయం వారికి తెలియజేశామని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు.

పాకిస్తాన్ మిలిటరీ కోర్టు కులభూషణ్ కు మరణశిక్ష విధించింది. భారత దౌత్యంతో అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి, ఇంటర్నేషనల్ కోర్టులో భారత్ వాదనలతో శిక్ష వాయిదా పడింది. అంతర్జాతీయ నిబంధనలను కాలరాస్తూ పాకిస్తాన్ కులభూషణ్ ను అరెస్ట్ చేసిందని భారత్ ఆరోపించింది. వియన్నా ఒప్పందం ప్రకారం అతనికి భారత కౌన్సిలర్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది.