కాంగ్రెస్ నేతల్లారా.. గ్రామాల్లోకి వెళ్లి అడగండి!

బీసీల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వెళ్లి అడిగితే తెలుస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. 2017-18 రాష్ట్ర బడ్జెట్ లో బీసీల సంక్షేమం కోసం 5 వేల 70 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. హైదరాబాద్ లోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మరో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
బీసీలను రాజకీయ పార్టీలు గతంలో కేవలం ఓటు బ్యాంకులుగానే చూసేవని, టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కుల వృత్తులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నదని అంజయ్యయాదవ్ చెప్పారు. గొల్ల, కురుమలకు గొర్రెలు, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నదని వివరించారు. ఇతర వృత్తి కులాలు అన్నిటికి పెద్దమొత్తంలో నిధులు ఇస్తున్నారని వెల్లడించారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ బీసీల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ స్వార్థంతో, ఈర్శ్యతో సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.