కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ నామినేషన్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ నివాసానికి వెళ్లిన రాహుల్.. అక్కడి నుంచి రాజ్ ఘాట్ కు, శివాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మాజీప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్, నారాయణ స్వామి, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, కమల్ నాథ్, షీలా దీక్షిత్ వంటి సీనియర్ నేతల సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం రాహుల్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో.. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు నామనేషన్ దాఖలు గడువు ముగియనుంది.  అటు రాహుల్ కు మద్దతుగా పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ ను విజయపథంలోకి నడిపిస్తారని సీనియర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.