ఓడీఎఫ్ జిల్లాగా నిజామాబాద్

బహిరంగ మల విసర్జన వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఎంపీ కవిత కోరారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) జిల్లాగా నిజామాబాద్ ఏర్పడిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఓడీఎఫ్ పై సమావేశం జరిగింది. ఎంపీ కవిత ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఓడీఎఫ్ లో దేశంలో 110 వ స్థానంలో, రాష్ట్రంలో 4 వ స్థానంలో నిజామాబాద్ జిల్లా నిలవడం మనందరికీ గర్వకారణం అన్నారు ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లాలో 3 లక్షల 6 వేల 32 ఇండ్లు ఉన్నాయని, వీటిలో 3లక్షల ఇండ్లలో మరుగు దొడ్లు నిర్మించుకున్నారని తెలిపారు. 1 లక్ష ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించగా, మిగతా 2 లక్షల ఇండ్లలో స్వచ్ఛందంగా టాయిలెట్స్ నిర్మించుకున్నారని కవిత వివరించారు.

టాయిలెట్స్ నిర్మాణం పూర్తయిన చోట మ్యాజిక్ సోక్ పిట్ లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఎంపీకవిత సూచించారు. ట్యాంక్ ల వద్ద, కమ్యూనిటీ సోక్ పిట్, వర్షపు నీరు, ఇండ్లలో నుండి వచ్చే మురికి నీరు ఇంకెలా గుంతల నిర్మాణం చేపట్టాలని చెప్పారు.  అలాగే ఫార్మ్ పాండ్స్, డంపింగ్ యార్డులపై దృష్టి పెట్టాలన్నారు.

ఇళ్లలో నుంచి సేకరించే పొడి, తడి చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేసేందుకు వెయ్యి 3 చక్రాల (ట్రై సైకిళ్లు) పంపిణీ చేశామని, వారు సైకిళ్లను తొక్కలేక పోతున్నామని చెప్తున్నారని ఎంపీ కవిత తెలిపారు. ప్రతి గ్రామంలో 20 మంది దాకా ప్రభుత్వ ఉద్యోగులు, ఐదారుగురు పంచాయతీ సిబ్బంది ఉంటారని.. ఆసక్తి ఉన్నవారికి ఆ సైకిళ్లు అందజేయాలని సూచించారు.

మంత్రి కేటీఆర్ నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్లు ఇచ్చారని ఎంపీ కవిత గుర్తుచేశారు. వీటిలో కొంత నిధులతో నిజామాబాద్ లోని 50 డివిజన్లు, ఆర్మూర్ లో 23, బోధన్ లో 30 డివిజన్లలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

డ్రైవర్-కం-ఓనర్ స్కీమ్ కింద ప్రభుత్వం స్వచ్ఛ బ్రాండింగ్ తో ఆటో ట్రాలీలను అందజేస్తున్నదని, జిల్లాలో నెల రోజుల్లో కార్యక్రమం చేపట్టాలని ఎంపీ కవిత కోరారు. నోటిఫైడ్ స్లమ్స్ లో కమ్యూనిటీ టాయిలెట్స్, షవర్ బాత్ ల నిర్మాణం చేపట్టాలని, మిషన్ భగీరథ స్కీమ్ లో వీటితో పాటు స్కూళ్లు, దేవాలయాలు, శ్మశానాలకు వాటర్ సరఫరా జరిగేలా చూడాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఎన్ఆర్జీఎస్ నిధులు 4 నెలలు ఆలస్యంగా విడుదల అవుతున్నాయని, అందరికీ ఇబ్బందిగా ఉందన్నారు. పర్యావరణానికి, వ్యక్తిగతంగా హాని చేస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఎంపీ కవిత కోరారు.

ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, వైస్ చైర్ పర్సన్ సుమనారెడ్డి, మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఇంచార్జ్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఆర్మూరు, బోధన్ మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు.