ఓఖీ విధ్వంసం

ఓఖీ తుఫాను వణుకు పుట్టిస్తోంది. సైక్లోన్‌ దాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. కడలి తీర ప్రాంతంలో మొదలైన కల్లోలం లక్షద్వీప్‌తో పాటు పలు రాష్ట్రాల ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. నవంబర్‌ 30న బంగాళాఖాతంలో వాయుగుండంగా మొదలైన ఓఖీ.. అరేబియా సముద్రంలో ప్రవేశించి మరింత బలపడింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలను కుదిపేసిన ఓఖీ, డిసెంబర్‌ 2న లక్షద్వీప్‌ వద్ద తీరం దాటుతుందని భావించినా ఎప్పటికప్పుడు తన దిశను మార్చుకుంటూ బీభత్సం సృష్టిస్తోంది.

ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో ఓఖీ తుఫాన్‌ పెను విధ్వంసాన్నే సృష్టిస్తోంది. వంద కిలోమీటర్లకుపైగా వేగంతో వీస్తున్న గాలులకు తోడు ఆకాశానికి చిల్లుపడిందా అనేంతగా కురుస్తున్న వర్షాలతో ఓఖీ ప్రభావిత ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకువెళ్లదీయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఓఖీ తుఫాను వందలాది ఇళ్లను నేలమట్టం చేసి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తినేందుకు తిండి, తాగేందుకు నీరు దొరకక జనం నానా యాతన అనుభవించాల్సిన పరిస్థితి కల్పించింది. ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకొరగడం, కరెంటు స్తంభాలు కూలిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయి పలు ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి.

ఓఖీ తుఫాన్‌ కేరళలో పెను విధ్వంసం సృష్టించింది. ఈదురుగాలులు, భారీ వర్షాల ధాటికి వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది కొబ్బరి చెట్లు నేలకూలాయి. అనేక  ప్రాంతాల్లో విద్యుత్‌,  సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఓఖీ దెబ్బకు కేరళలో దాదాపు 30 మంది వరకు మృత్యువాత పడగా.. వంద మందికిపైగా ఆచూకీ లేకుండాపోయారు. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యల ఫలితంగా వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు.

కేరళను చివురుటాకులా వణికించిన ఓఖీ తుఫాన్‌ కారణంగా ప్రసిద్ధ క్షైత్రమైన శబరిమల అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా సన్నిధానం, పంబ తదితర ప్రాంతాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది. ఫలితంగా అయ్యప్ప మాలధారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సమాచారవ్యవస్థ  కుప్పకూలడంతో కనీసం ఫోన్‌ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.

తిరువనంతపురం సమీపంలో నవంబర్‌ 29న సముద్రంలోకి వెళ్లిన 292 మంది మత్స్యకారుల్లో 2వందల మందిని అధికారులు రక్షించారు. మిగిలిన 92 మంది ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. తమ వారి జాడ తెలియక వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు మొదట పలకరించేది కేరళనే అయినా ఆ రాష్ట్రానికి మాత్రం తుఫానులు అరుదుగా వస్తుంటాయి. గత వందేళ్లలో కేవలం మూడు తుఫానులు మాత్రమే కేరళను తాకడం విశేషం.

ఓఖీ తుఫాను తమిళనాడుకు తీరని వేదన మిగిల్చింది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా పది మంది వరకు మృత్యువాతపడగా… వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు దొరకక చాలా మంది అవస్థలు పడ్డారు. సరిహద్దు జిల్లా అయిన కన్యాకుమారిని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. వరద ఉదృతికి రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.  కరెంటు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ కుప్పకూలింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలించకపోవడంతో కన్యాకుమారి నుంచి బయలుదేరే అన్ని ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాల కారణంగా ప్రజలు అవస్థలు పడ్డారు.

ఓఖీ తుఫాన్‌ ప్రభావంతో ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. సముద్రం అల్లకల్లోలంగా మారింది. వరద నీటి కారణంగా ముంబై – పుణె రహదారిపై రాకపోకలు కష్టంగా మారింది. గోవా ఉత్తర ప్రాంతంపైనా ఓఖీ తన ప్రతాపం చూపింది. ప్రాణనష్టం జరగనప్పటికీ, మోర్జిం, అరంబోల్‌, కండోలిం, కలంగూట్‌ బీచ్‌లలోని దుకాణాలు, రెస్టారెంట్లు దెబ్బతిన్నాయి.

అనూహ్యంగా దిశ మార్చుకుంటున్న ఓఖీ తుఫాన్‌ తాజాగా గుజరాత్‌ వైపు దూసుకెళ్లింది. అయితే, గుజరాత్‌ తీరంలో కేంద్రీకృతమైన తుఫాను క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం గుజరాత్‌ తీరంలో సైన్యాన్ని, నౌకాదళాన్ని రంగంలోకి దింపింది. ఓఖీ కారణంగా పలు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

ఇదిలాఉంటే గుజరాత్‌ ఎన్నిల ప్రచారంపై ఓఖీ తుఫాన్‌ నీళ్లు చల్లింది. సూరత్‌, సౌరాష్ట్రతో పాటు వల్సాడ్‌, నవసారి, భరూచ్‌, దాంగ్‌, తాపి, అమ్రేలి, గిర్‌సోనత్‌, భావ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా ఎన్నికల ప్రచార ర్యాలీలు, బహిరంగ సభల్ని పార్టీలు రద్దు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ మోర్బీ, ధ్రాంగద్ఱ, సురేంద్ర నగర్‌లో పర్యటించాల్సి ఉండగా.. రాజులా, మహువా, సిహోర్‌లో జరగాల్సిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రచారాన్ని నేతలు వాయిదా వేశారు.