ఐవోఏ అధ్యక్షుడిగా నరేందర్ బాత్రా

భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్ష పదవి దాఖలు చేసిన నామినేషన్‌ను.. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ మాజీ చీఫ్ అనిల్ ఖన్నా ఉపసంహరించుకున్నాడు. ఈ మేరకు తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఐవోఏ ఎన్నికల సంఘానికి లేఖ రాశాడు. దీంతో ఐవోఏ అధ్యక్షుడిగా నరేందర్ బాత్రా ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. బాత్రాకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ ఎన్నికల రేసులోకి దిగిన ఖన్నా.. నామినేషన్ ఉపసంహరణ గడువు ఈనెల 3 వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈనెల 14న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో తాను బాత్రాకు మద్దతిస్తానని వెల్లడించాడు. ఖన్నా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నా.. సాంకేతికంగా అతను పోటీలో ఉన్నట్లేనని ఐవోఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఎన్నికల్లో బాత్రాకు ఓటు వేస్తే సరిపోతుందన్నారు.