ఏడాదిలో ఇంటింటికి ఇంటర్నెట్!

వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో పని చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఐటి, పరిశ్రమల శాఖల్లో చేపట్టిన పలు ప్రాజెక్టులపై మంత్రి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పరిశ్రమలు, టిఎస్ఐఐసి, ఐటి శాఖల అధికారులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తవుతుందన్న నేపథ్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులపైన ప్రత్యేకంగా మంత్రి ఈ సమావేశంలో చర్చించారు.

ఇంటింటికి ఇంటర్నెట్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ కింద అందిస్తున్న ఆర్థిక సహాయంతో పాటు, రాష్ర్ట  ప్రభుత్వం తరపున కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అధికారులు మంత్రి కేటీఆర్ కు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కు విజయ బ్యాంక్ 561 కోట్ల రూపాయలు రుణాన్ని అందించే పత్రాలను బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ రాజు మంత్రికి అందించారు.

వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మార్పులను ప్రపంచానికి చూపేందుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాలుగు గ్రామాల్లో చేపడుతున్న టెక్నాలజీ డెమాన్ స్ర్టేషన్ నెట్ వర్క్ జనవరి మొదటివారంలో పూర్తవుతుందని అధికారులు మంత్రికి తెలియజేశారు. తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒనగూరే ప్రయోజనాలను ఈ నెట్ వర్క్ తెలియజేస్తుందన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో 10 ప్రసిద్ధ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయని వివరించారు.

హైదరాబాద్ ఫార్మా సిటీ భూసేకరణ, అనుమతుల ప్రక్రియను మంత్రి కేటీ రామారావు ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పర్యావరణ అనుమతులు వస్తాయని అధికారులు మంత్రి కేటీ రామారావుకు తెలిపారు. టిఎస్ ఐఐసి చేపట్టిన పలు ఇతర ప్రాజెక్టులు, పార్కుల నిర్మాణ పురోగతి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.  టిహబ్ -2, ఇమేజ్ టవర్, టీ వర్క్స్ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. టీ వర్క్స్ భవనం తాలూకు డిజైన్లను సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది మే నెలాఖరుకు టీ వర్క్స్ పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.