ఎవరికి కొలువుల కోసం వాళ్ల కొట్లాట?

కొలువుల కొట్లాట ఎవరి కోసమని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కొలువుల కొట్లాట మీ పదవుల కోసమా? అని కాంగ్రెస్ నేతలను మంత్రి నిలదీశారు. జైపాల్‌రెడ్డి కొలువు కోసమా.. జానారెడ్డి కొలువు కోసమా? ఉత్తమ్ కు మంత్రి పదవి కోసమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ డ్రామాలాడుతున్నదని మండిపడ్డారు. ప్రజలు తమకు 60 నెలల అధికారం ఇచ్చారని, ఆనాటి వరకు లక్ష కాదు లక్షా పన్నెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేటీఆర్.. అక్కడి మున్సిపాలిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

రాష్ట్రంలో కొంతమంది నాయకులు ఓ రిటైర్డ్ ప్రొఫెసర్‌ను పట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ రోజు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న నాయకులు ఉద్యమ సమయంలో ఏనాడైనా కలిసి వచ్చారా? అని నిలదీశారు.
50 ఏళ్లు అధికారమిస్తే కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదని, ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఫార్మాసిటీ భూసేకరణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని నిప్పులు చెరిగారు. ఫార్మాసిటీతో పాలమూరు, రంగారెడ్డి యువతకు లక్ష ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ తెలిపారు. ప్రతీ అంశంపై కోర్టుకు వెళ్లి అడ్డుపడుతున్నారని విమర్శించారు.

నెహ్రూ నుంచి రాహుల్ వరకు తెలంగాణను నిండా ముంచింది కాంగ్రెస్సే అని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొసలి కన్నీరు కారుస్తున్న ముసలి నక్క కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. తమ బాసులు ఢిల్లీలో లేరు.. తెలంగాణ గల్లీలో ఉన్నారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని మంత్రి తెలిపారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో పాలమూరు జిల్లా పచ్చబడుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహబూబ్ నగర్ లో గతంలో 14 రోజులకోసారి నీళ్లు వచ్చేవని, ఇప్పుడు రెండు రోజులకోసారి ఇస్తున్నామని చెప్పారు. వచ్చే ఎండాకాలం నాటికి మహబూబ్‌నగర్‌లో ఇంటింటికి ప్రతీ రోజు నీరిస్తామన్నారు.

గతంలో పాలమూరు దేశంలోనే వెనుకబడిన జిల్లా అని, ఇప్పుడు పాలమూరు జిల్లా దశ మారిందన్నారు మంత్రి కేటీఆర్. వలస పోయినోళ్లు జిల్లాకు తిరిగి వస్తున్నారని తెలిపారు. వలసపోయిన రాజకీయ నాయకులు కూడా తిరిగి వస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో పాలమూరుకు అన్యాయం చేసి సీమాంధ్ర నాయకుల వెంట తిరిగిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు తామున్నామంటూ వస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. పాలమూరు ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్న సోయి లేనివాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

మహబూబ్ నగర్, భూత్ పూర్, జడ్చర్లతో కలిపి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పాలమూరు పాత కలెక్టరేట్ ను మాతా, శిశు సంరక్షణ కేంద్రంగా మారుస్తామని, కొత్త కలెక్టరేట్ కడతామని తేల్చిచెప్పారు.