ఎన్టీపీసీ ప్లాంట్ పనులను పరిశీలించిన సీఎం

విద్యుత్ ధగధగలతో తెలంగాణ జాజ్వల్యమానంగా వెలిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల కోతల్లేని కరెంటు సరఫరా దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ దిశగా  కరెంటు ఉత్పత్తిపై సీరియస్ గా దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్. విద్యుత్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామగుండంలోని ఎన్.టి.పి.సి. పవర్ ప్లాంట్ ను సీఎం సందర్శించారు.

తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం ఎన్.టి.పి.సి ఆధ్వర్యంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. అందులో భాగంగా మొదటి విడత 1600 మెగావాట్ల (2×800) సామర్థ్యం కలిగిన యూనిట్ల నిర్మాణం ప్రారంభమయ్యింది. ఈ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు.

2020 మే నాటికి మొదటి యూనిట్ ను.. ఆ తర్వాత మరో ఆరు నెలలకు రెండో యూనిట్ ను పూర్తి చేస్తామని ఎన్.టి.పి.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దుబే సీఎం కేసీఆర్ కు వివరించారు. నిర్మాణంలో వేగం పెంచి… నిర్దేశిత లక్ష్యంలోపు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి  బిహెచ్ఇఎల్ అధికారులకు సూచించారు. రాష్ర్టంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇతర అవసరాలున్నందువల్ల సాధ్యమైనంత త్వరగా విద్యుత్ అందించాలన్నారు. ప్లాంటు నిర్మాణం, నిర్వహణకు అవసరమైన నీరు అందించటంతో పాటు ఇతర సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

విద్యుత్ ప్లాంటుల నిర్మాణం, తెలంగాణ విద్యుత్ సంస్థలతో అనుసంధానం తదితర అంశాలను జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు  సీఎం కేసీఆర్ కు వివరించారు.