ఉచితంగా నీట్, జేఈఈ కోచింగ్

ప్రభుత్వ జూనియర్  కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఈ ఏడాది నుండి నీట్ మరియు జేఈఈ ఉచిత కోచింగ్ ఇస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. పాత పది జిల్లాల్లో జిల్లాకో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్, స్పెషల్ ఆఫీసర్స్ తో  హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆయన సమావేశమయ్యారు. ఇంటర్ విద్యను బలోపేతం చేయడం, మార్చిలో జరిగే పరీక్షల్లో మంచి ఫలితాలు రాబట్టడంపై చర్చించారు. వచ్చే 75 రోజులు విద్యార్థులకు చాలా ముఖ్యమని కడియం చెప్పారు. కార్పొరేట్ కాలేజీల కంటే మంచి ఫలితాలు సాధించాలని కోరారు.

రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతుంటే వారిలో  రెండున్నర లక్షల మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్నారని కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో ఐదు లక్షల మంది విద్యార్థులు చదివేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతామని తెలిపారు. వేసవి సెలవులు తరువాత ఒక్కో కాలేజీకి నిర్వహణ కోసం లక్ష రూపాయల చొప్పున ఇస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు వచ్చే ఏడాది నుండి ఉచిత బస్సు పాస్ ఇస్తామని ప్రకటించారు.

2017-18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ పెంచిన లెక్చరర్స్ ను డిప్యూటీ సీఎం కడియం అభినందించారు. మన ఇంటర్మీడియట్ బోర్డ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే విద్యా సంవత్సరం అదనంగా రెండు లక్షల విద్యార్థుల అడ్మిషన్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జరగాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉచిత విద్యను అందిస్తున్నామని కడియం చెప్పారు. రూ.270 కోట్ల ఖర్చుతో  ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సొంత భవనాలతో పాటు మౌళిక వసతులు కల్పిచామని తెలిపారు. భవనాలు లేని కాలేజీలకు ఆధునిక భవనాలు కట్టిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఫ్యాకల్టీ కొరత లేదన్నారు. చాలామంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ గా ప్రమోషన్ ఇచ్చామని గుర్తుచేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేయాలని సీఎం కేసీఆర్ జీవో విడుదల చేస్తే కొంత మంది కోర్టుకు వెళ్లారని, వారికి సముచిత వేతనం ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వారి వేతనాలు పెంచారని వివరించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, మెరుగైన ఫలితాల ద్వారా దాన్ని తిప్పికొట్టాలని కోరారు.