ఈ నెల 21న 2జీ స్పెక్ట్రమ్ తుది తీర్పు

దేశ వ్యాప్తంగా సంచలనం  సృష్టించిన 2జీ స్పెక్ర్టమ్ కేసులో తుది తీర్పు  తేదీ ఖరారైంది. ఈ నెల 21 తుది తీర్పు ఇవ్వనున్నట్లు పాటియాల కోర్టు తెలిపింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎంపీ కనిమొళి..ఇవాళ విచారణకు హాజరయ్యారు. తుది తీర్పుకోసం డిసెంబర్ 21 వరకు వేచి చూద్దామని ఈ సందర్భంగా ఆమె మీడియాతో అన్నారు. అటు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధం ఉన్న మూడు ప్రధాన స్పెక్ట్రమ్ కేసుల్లో సీబీఐ కోర్టు తన తీర్పును వెల్లడించాల్సి ఉంది. వాస్తవానికి గత అక్టోబర్ 25వ తేదీన ఈ కేసులో సీబీఐ కోర్టు తీర్పును ఇవ్వాల్సి ఉండగా, డాక్యుమెంట్లు ఎక్కువగా ఉన్న కారణంగా నవంబర్ 7వ తేదీకి కేసును వాయిదా వేశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సీబీఐ రెండు కేసులు నమోదు చేయగా, ఈడీ మరో కేసును వేసింది. మాజీ టెలికాం మంత్రి రాజా, ఎంపీ కనిమొళిల పేర్లు ఛార్జ్‌ షీట్‌లో ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్ కింద 122 లైసెన్సులు ఇవ్వడం వల్ల సుమారు 31 వేల కోట్ల నష్టం వచ్చినట్లు సీబీఐ తన కేసులో ఆరోపణలు చేసింది.