ఈ-నామ్‌తో దళారీ వ్యవస్థకు చెక్

ఈ-నామ్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల దళారీ వ్యవస్థ పోతుందని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. 2018 ఖరీఫ్ నాటికి అన్ని మార్కెట్‌లలో ఈ-నామ్ అమలు జరగాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ బోయిన్‌పల్లి మార్కెట్‌లో ఈ-సేవ శిక్షణ తరగతులను హరీష్ ప్రారంభించారు. ఈ-నామ్‌పై అవగాహన పెంపొందించేందుకు, అమలు చేసేందుకు శిక్షణ తరగతులను ప్రారంభించామన్నారు. ఈ-సేవ శిక్షణ తరగతులు ఆరు రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ-నామ్ ద్వారా రైతులకు పోటీతత్వం పెరగాలన్నారు. మద్దతు ధర ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని రైతులకు సూచించారు. ఇప్పటికే 46 మార్కెట్‌లలో ఈ-నామ్ ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ-నామ్ ద్వారా అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఈ-నామ్ ఉపయోగించుకోవడంలో నిజామాబాద్ మార్కెట్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ప్రతీ ఒక్కటి ఆన్‌లైన్‌లో జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖకు సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయించారని తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌లో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ప్రతీ మండలానికి ఒక గోదాంను నిర్మించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో మన కూరగాయాలు స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా స్వచ్ఛమైన కూరగాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారని మంత్రి మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.