ఈ తల్లి రాక్షసి కన్నాఎక్కువ

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఓ తల్లి రాక్షసంగా ప్రవర్తించింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని నాలుగేళ్ల తన బిడ్డను చిత్రహింసలు పెట్టింది. ప్రియుడితో కలిసి వేడి పెనంపై చిన్నారిని కూర్చోపెట్టింది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన లలిత, ప్రకాశ్ అనే యువకుడి మధ్య కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. లలితకు నాలుగేళ్ల వయసున్న కూతురు రూప ఉంది. ప్రకాశ్‌కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. వీరిద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకొని.. కొన్ని నెలల క్రితం పారిపోయి హైదరాబాద్‌కు చేరుకున్నారు. భార్యాభర్తలమని చెప్పి ఎస్ఆర్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో పనికి కుదిరారు. లలిత వంట మనిషిగా, ప్రకాశ్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. అయితే, లలిత తనతో పాటు తీసుకొచ్చిన  కూతురిని వదిలేయాలని ప్రకాశ్ ఒత్తిడి తెచ్చాడు. అంతేకాకుండా చిన్నారిని తీవ్రంగా చిత్రహింసలు పెట్టారు. వేడి పెనంపై బాలికను కూర్చోపెట్టి తీవ్రంగా గాయపరిచారు. రూప కాళ్లు, పిరుదులు తీవ్రంగా కాలిపోయాయి. దీనికి తోడు చిన్నారిని వదిలించుకోవాలని కుట్ర చేశారు.

లలిత తన ప్రియుడితో కలిసి నిన్న రాత్రి నాంపల్లిలోని పోలీసు భరోసా కేంద్రానికి వెళ్లింది. తీవ్రమైన గాయాలతో ఉన్న ఈ చిన్నారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తమకు దొరికిందని పోలీసులకు చెప్పారు. అక్కడే ఉన్న చైల్డ్‌లైఫ్ అధికారులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేద్దామని అక్కడికి లలిత, ప్రకాశ్‌ను తీసుకెళ్లారు. పోలీసుల విచారణలో బాలిక అనాథ కాదని.. లలిత కూతురు అని తేలింది. బాలికను వదిలించుకునేందుకే తల్లి నాటకమాడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో లలిత, ప్రకాశ్‌ను ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు అప్పగించి.. చిన్నారిని యూసుఫ్‌గూడలోని శిశు విహార్‌కు తరలించారు. చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించిన లలిత, ప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.