ఈశ్వరీబాయి సేవలు మరువలేనివి

సమాజ సేవకురాలు, దళిత సంక్షేమకర్త దివంగత ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలు.. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరు అయ్యారు. ఈశ్వరీబాయిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే గీతారెడ్డితో కలిసి తిలకించారు. ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డ్-2017ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బలరాజ్, ప్రభుత్వ సలహాదారు రమణచారి, బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, TSPSC చైర్మన్ ఘంట చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.

ఈశ్వరీబాయి సేవలు మరువలేనివని.. దశాబ్దాల క్రితమే మహిళా సాధికారత కోసం ఆమె కృషి చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈశ్వరీబాయి ధీర వనిత. ఆమె బాటలోనే ఎమ్మెల్యే గీతారెడ్డి కూడా నడుస్తున్నారని ప్రశంసించారు.

డాక్టర్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ఈశ్వరీబాయి కృషి చేశారని ఎమ్మెల్యే గీతారెడ్డి చెప్పారు. అంబేద్కర్ మనువడైన ప్రకాష్ అంబేద్కర్ కి ఈశ్వరి భాయ్ అవార్డ్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. చిన్న రాష్ట్రాలు ప్రగతి సాధించలేవన్న వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారని ప్రకాశ్‌ అంబేద్కర్ అన్నారు. ఆనతి కాలంలోనే తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఈశ్వరీబాయి అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రకాశ్ అంబేద్కర్.

దశాబ్దాల క్రితమే ఈశ్వరీ బాయి తెలంగాణవాణిని వినిపించి, ఇప్పటి ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచారని ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి కొనియాడారు. తెలంగాణ స్వాతంత్ర్యం, అస్తిత్వం కోసం పోరాడిన మహిళా యోధురాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఈశ్వరీ బాయి దశాబ్దాల క్రితమే శాసనసభల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించిన గొప్ప వ్యక్తని  బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కీర్తించారు.

ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాల్లో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.