ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలెం!

ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలెంను అమెరికా గుర్తించనుంది. ప్రస్తుత రాజధాని టెల్‌ అవీవ్‌ నుంచి తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. ప్రస్తుతం జెరూసలెం ఇటు ఇజ్రాయెల్‌కు, అటు పాలస్తీనాకు పవిత్ర నగరంగా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఏర్పడే తమ దేశానికి తూర్పు జెరూసలెంను రాజధానిగా చేసుకోవాలన్న ఆలోచనలో పాలస్తీనా పాలకులు ఉన్నారు. ఇలాంటి తరుణంలో అమెరికా తీసుకొన్న నిర్ణయం పశ్చిమాసియా వ్యవహారాల్లో పెను మార్పులను తీసుకురానుంది. ఈ పరిణామం సహజంగానే అరబ్‌ దేశాలను ఆగ్రహానికి గురి చేస్తోంది. మూడు రోజుల నిరసనలకు అవి పిలుపునిచ్చాయి. ట్రంప్‌ ప్రకటన చేయనున్న దృష్ట్యా.. అరబ్‌ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. జెరూసలెం పాతనగరం, వెస్ట్‌ బ్యాంక్‌లను వదిలి రావాల్సిందిగా తమ ఉద్యోగులను అమెరికా అప్రమత్తం చేసింది. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంతలేదన్నా మూడేళ్లు పడుతుందని వైట్‌హౌస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.