ఇక డీబీటీపైనే ఎరువుల సబ్సిడీ!

ఎరువుల సబ్సిడీని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు ఎరువులపై సబ్సిడీ చెల్లింపులు రూ.23 వేల కోట్లకు తగ్గాయని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పలు రాష్ర్టాలు ఎరువుల విక్రయంపై ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) పథకాన్ని అమలు చేయగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలులోకి రానున్నట్లు ఆయన చెప్పారు. 2014లో ఎరువుల సబ్సిడీ చెల్లింపులు రూ.44 వేల కోట్ల స్థాయిలో ఉండగా, ప్రస్తుతం ఇది రూ.23 వేల కోట్లకు తగ్గిందని.. ఢిల్లీలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ఈ సబ్సిడీలను పూర్తి స్థాయిలో చెల్లింపులు జరుపాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరుతున్నట్లు చెప్పారు. నష్టాలతో కొనసాగుతున్న యూరియా ప్లాంట్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నదని ఆయన ప్రకటించారు. గడిచిన పదిహేను సంవత్సరాలుగా యూరియా ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో కంపెనీలు భారీగా నష్టపోయాయన్నారు. ఎరువులపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని ఇండస్ట్రీ వర్గాలు డిమాండ్‌పై మంత్రి స్పందిస్తూ..ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించనున్నట్లు చెప్పారు. అమోనియా, పాస్ఫరిక్ యాసిడ్ వంటి ఎరువులను 18 శాతం శ్లాబుల నుంచి తగ్గించాలని కోరారు.