ఇంటర్నెట్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు!

ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే శక్తి ఇంటర్నెట్‌కు ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. ఢిల్లీలో జరుగుతున్న లీడర్‌షిప్ సదస్సులో ఆయన ప్రసంగించారు. అమెరికాది అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అని, భారత్‌ది అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమన్నారు. రాజ్యాంగంలో ఉన్న విలువలను ప్రతి రోజు మనం ప్రచారం చేయాలన్నారు. భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలన్నారు. కేవలం ఆసియాలోనే మాత్రమే కాకుండా, విశ్వవ్యాప్తంగా భారత్ తన పాత్రను పోషించాలని సూచించారు. మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని, పేద-ధనికుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పారిస్ వాతావరణ ఒప్పందం కోసం తాను, ప్రధాని మోడీ విశేషంగా కృషి చేసినట్లు చెప్పారు. భారత్, అమెరికా కలిసి పనిచేస్తే, పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదన్నారు. అంతర్జాతీయంగా ప్రజల్లో అభద్రతాభావం ఉందని, దాన్ని తొలిగిస్తేనే మానవ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ఐక్యత కోసం పనిచేస్తున్నారని, ప్రజలు మద్దతు ఇస్తేనే నవ సమాజం ఏర్పడుతుందన్నారు. న్యూక్లియర్ సైప్లె గ్రూప్‌లో భారత్‌ను చేర్చాలని తాము ప్రయత్నించామని, కానీ కొన్ని దేశాలు అడ్డుకుంటున్నట్లు తెలిపారు. ఉగ్రవాద చర్యలు ఎవరినైనా ఇబ్బందిపెడుతాయన్నారు. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా తాను ఇష్టపడుతానని, అతను దేశాభివృద్ధి కోసం చేస్తున్న కృషి చేస్తున్నారని చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ అన్నా తనకు అభిమానమన్నారు.