ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు న్యాక్ లో శిక్షణ

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దేశానికి తెలంగాణ దిక్సూచికగా నిలవాలనే ఆకాంక్షతో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని విద్యుత్, ఎస్సీల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఇంజినీరింగ్ పట్టభద్రులకు హైదరాబాద్ మాదాపూర్ లోని న్యాక్ ఆడిటోరియంలో తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ కార్పోరేషన్, న్యాక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ముందుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇంజినీరింగ్ కళాశాలలను ప్రక్షాళన చేశామని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రభుత్వ రంగ ఉద్యోగాలతో పాటు, ప్రైవేట్ రంగ సంస్థలలో కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంతో మంది విద్యార్థులు పట్టాలు పొంది ఉద్యోగాలు పొందలేక నిరాశలో ఉన్నారని, అందుకే ప్రభుత్వ సహకారంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామన్నారు.