అది ఆర్థిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు

భారత ఆర్థికవ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి నవంబర్ 8వ తేదీ బ్లాక్ డే అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి వ్యాఖ్యానించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు వల్ల సుమారు వంద మంది చనిపోయారని ఆయన తెలిపారు. క్యూల్లో నిలబడ్డ జనం అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా బాధతో, బాధ్యతతో ఈ విషయాన్ని చెబుతున్నానని మన్మోహన్ అన్నారు.

యూపీఏ పదేళ్ల పాలనతో పోల్చుకుంటే మోడీ సర్కారు హయాంలో వృద్ధి రేటు తక్కువగా ఉందని మన్మోహన్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలు వృద్ధి రేటును దెబ్బతీశాయన్నారు. జీఎస్టీ ప్రభావం వల్ల ఆర్ధిక వ్యవస్థ మందగించిందన్నారు.  ప్రధాని మోడీ చెప్పినట్లుగా 2022 లోగా భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరితే… తనకంటే ఎక్కువ సంతోషించేవారు ఎవరూ ఉండబోరని మన్మోహన్ అన్నారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. 35 శాతం వృద్ధి రేటు సాధిస్తేనే అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతామని, ఇప్పటి వరకూ ఏ ఒక్క దేశానికి ఆ వృద్ధి సాధ్యం కాలేదన్నారు మన్మోహన్