ఆసు యంత్రం ఆవిష్కర్తకు రూ.కోటి సహాయం

చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా చేనేత రంగానికి విశేష సేవలు అందిస్తున్న పద్మశ్రీ చింతకింది మల్లేశంకు ప్రభుత్వం కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించింది. మల్లేశంకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి కేటీఆర్‌ అందించారు. కోటి రూపాయల గ్రాంట్ ను..  మల్లేశం తన లక్ష్మి ఆసు యంత్రాల ఉత్పత్తిని పెంచేందుకు, మరియు చేనేత రంగానికి అవసరం అయిన ఇతర ఆవిష్కరణలు చేసేందుకు ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఆలేరులోని తన సొంత ఇంటి నుంచి ఆసు మెషీన్లను మల్లేశం తయారు చేస్తున్నారు. సుమారు 650 మెషీన్లకు డిమాండ్ ఉంది.. ప్రభుత్వ ఆర్థిక సహాయం ద్వారా ఈ మెషీన్లను మల్లేశం తయారు చేయనున్నాడు. వీటిని మెదట పోచంపల్లిలో పాత పద్దతుల్లో చేనేత పనులు నిర్వహిస్తున్న కార్మికులకు సరఫరా చేయనున్నారు.

గతంలోనే మల్లేశం ఆసు యంత్రాల తయారీకి ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మల్లేశం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం టెక్స్‌ టైల్‌ శాఖ తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ఆర్థిక సాయానికి సంబంధించిన పరిపాలన ఉత్తర్వులను మల్లేశంకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు సాధ్యమైనంత ఎక్కువగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని, ఇప్పటికే టెక్స్‌ టైల్‌ శాఖకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రూరల్ ఇన్నోవేషన్ రంగానికి ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. అందులో భాగంగానే గ్రామీణ స్థాయి నుంచి అద్భుతమైన అవిష్కరణ చేసిన చింతకింది మల్లేశం సేవలను ప్రత్యేకంగా గుర్తించి ఈ ఆర్థిక సాయం అందించామన్నారు. భవిష్యత్‌ లో మల్లేశంకు మరింత సహాకారం అందిస్తామన్నారు.

అడిగిన వెంటనే ఆర్థిక సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌ కు.. చింతకింది మల్లేశం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఒక ఎకరం భూమిలో షెడ్డుతో పాటు, కార్యాలయం, రవాణా వాహనం, మెషినరీ, వర్కింగ్ క్యాపిటల్ వంటి వాటి కోసం ఈ కోటి రూపాయలను వినియోగిస్తానన్నారు.