ఆర్నెళ్ల ముందే ఐడియా-వొడాఫోన్‌ విలీనం

టెలికాం సంస్థలు ఐడియా-వొడాఫోన్‌ విలీన ప్రక్రియ వేగవంతమైంది. అనుకున్నదాని కంటే ఆర్నెళ్ల ముందుగానే ఈ విలీన ప్రక్రియ ముగియనున్నట్లు సమాచారం. మొదట విలీన ప్రక్రియ సెప్టెంబర్‌ 2018 నాటికి పూర్తికావాలని నిర్ణయించారు. అంతకంటే ఆర్నెల్ల‌కు ముందే అంటే మార్చి-ఏప్రిల్‌ నాటికి ఈ ప్రక్రియను ముగించాలని ప్రస్తుతం భావిస్తున్నారు. విలీనానికి కావాల్సిన అనుమతులన్నీ 2018 మార్చి/ఏప్రిల్‌ నాటికి లభించే అవకాశాలు ఉన్నాయని మేనేజ్‌మెంట్‌ భావిస్తోందని ఇటీవల ఐడియా సెల్యూలర్‌ లీడర్‌షిప్‌ సమావేశాన్ని ఉటంకిస్తూ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా-మెరిల్‌ లించ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. వొడాఫోన్‌ ఇండియా నేతృత్వంలోని వొడాఫోన్‌, కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఐడియా దేశంలో రెండో, మూడో అతిపెద్ద టెలికాం సంస్థలు. ఈ రెండు సంస్థలు.. విలీనం ద్వారా 400 మిలియన్‌ వినియోగదారులతో దేశంలో పెద్ద టెలికాం కంపెనీగా అవతరలించాలని చూస్తున్నాయి.