ఆర్కేనగర్‌ బరిలో హీరో విశాల్

తమిళ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్ హాసన్‌ పొలిటికల్ ఎంట్రీపై చర్చ కొనసాగుతుండగా.. హీరో విశాల్‌ అడుగు ముందుకేశారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక బరిలో దిగనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. దీంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఇన్ని రోజులు అన్నాడీఎంకే వర్సెస్‌ శశికళ వర్గంగా ఉన్న ఈ  ఉప ఎన్నిక.. విశాల్  ఎంట్రీతో త్రిముఖ పోరుగా మారింది. ఇండిపెండెంట్‌  అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. సోమవారం తన మద్దతుదారులతో కలిసి విశాల్‌ నామినేషన్‌  వేయనున్నట్లు ఆయన పీఆర్‌ఓ అధికారికంగా ప్రకటించారు.

అమ్మ వారసత్వం కోసం పోటీపడుతున్న అన్నాడీఎంకే, శశికళ వర్గానికి విశాల్‌ ప్రవేశంతో షాక్ తగిలినట్లయ్యింది. చెన్నైలోని ఆర్‌కే నగర్‌లో తెలుగు ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. తెలుగు మూలాలు కలిగిన వారిని విజయం వరిస్తుందని పార్టీలు భావిస్తున్నాయి. తెలుగువాడైన మధుసూదనన్‌ను అన్నాడీఏంకే తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు శశికళ వర్గం నుంచి దినకరన్ బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో హీరో విశాల్ కూడా పోటీ చేయనుండడంతో.. ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పటికే విశాల్ ఫ్యాన్స్‌  సోషల్ మీడియాలోప్రచారం కూడా మొదలు పెట్టారు. జయలలిత సినీ రంగం నుంచి వచ్చారని, ఆమెకు అధికారిక వారసులు లేనందువల్ల విశాలే అసలు వారసుడంటూ ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు.

ఇటు బీజేపీ కూడా ఉప ఎన్నికల బరిలోకి దిగింది. బీజేపీ అభ్యర్థిగా కరు నాగరాజన్‌ పోటీ చేయనున్నారు. డిసెంబర్‌ 21న పోలింగ్‌ జరగనుంది. 24న ఫలితం వెలుబడనుంది. జయలలిత మరణం తర్వాత ఆరు నెలల లోపే ఈ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ.. సాధ్యం కాలేదు.