ఆమెతో పోల్చడం ఆనందంగా ఉంది!

కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న థ్రిల్లర్ చిత్రం ‘సీత..రాముని కోసం’. సీతారాముల్లాంటి ఓ జంట కథతో దర్శకుడు అనిల్ గోపిరెడ్డి సినిమాను రూపొందించారు. రాముడి కోసం సీత ఎలాంటి త్యాగానికి సిద్ధపడిందనేది ఆకట్టుకుంటుంది అని అన్నారు కారుణ్యచౌదరి. ఆమె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్‌గోపిరెడ్డి దర్శకత్వం వహించారు. శిల్పా శ్రీరంగం, సరితా గోపిరెడ్డి, డాన్ నందన్ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. ఇటీవల హైదరాబాద్‌లో కారుణ్యచౌదరి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ప్రేమకు మరణం లేదనే పాయింట్‌తో రూపొందిన వినూత్న కథా చిత్రమిది. దర్శకుడు అనిల్ చెప్పిన కథలోని కొత్తదనం నచ్చడంతో ఈ సినిమాను అంగీకరించాను. అభినయానికి ప్రాధాన్యమున్న పాత్ర నాది. బాపు సినిమాల్లో కథానాయికలా సంప్రదాయబద్ధంగా సాగుతుంది. సీతగా చాలా కాలం పాటు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతాననే నమ్మకముంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సౌందర్యలా నటించావని ప్రశంసిస్తున్నారు. అలాంటి గొప్ప నటితో నన్ను పోల్చడం ఆనందంగా ఉంది. నాతో పాటు హీరో శరత్, బేబీ శాన్వి పాత్రలు కథకు కీలకంగా నిలుస్తాయి అని తెలిపింది.