ఆధార్ అనుసంధానం గడువు పెంపు

ఆధార్ అనుసంధానంపై ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సిమ్ కార్డులు, బ్యాంకు అకౌంట్లు, ఇతర సేవలతో ఆధార్ అనుసంధానం చేసేందుకు గడువును మార్చి 31 వరకు పొడిగిస్తామని తెలిపింది. ఆధార్ లింక్ పై గడువు ముగియనుండటంతో.. సుప్రీం కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. తాత్కాలిక ఉపశమనం కోసం గడువును పొడిగించాల్సిందిగా పిటిషనర్ల తరుపు న్యాయవాది వాదించారు. దీంతో  సిమ్ కార్డులు, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ లింక్ గడువును పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వ తరపున అటార్ని జనరల్ వేణుగోపాల్ త్రిసభ్య ధర్మాసనం ముందు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఆధార్ నెంబర్ లేని వారికి మాత్రమే పొడగింపు ఉంటుందని ఆయన చెప్పారు. సిమ్ కార్డులను ఆధార్ అనుసంధానికి ఫిబ్రవరి 6 వరకు గడువు ఉందని వేణుగోపాల్ గుర్తు చేశారు. మరోవైపు ఆధార్ అనుసంధానంపై వస్తున్న పిటీషన్లను విచారించేందుకు వచ్చే వారం రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయనున్నారు.