ఆటో షో అదుర్స్!

కోట్ల రూపాయల విలువైన మోడ్రన్ కార్లు! లక్షల ఖరీదు చేసే స్పోర్ట్స్ బైకులు! పాతతరాన్ని పరిచయం చేసే వింటేజ్ వాహనాలు! ఇలా ఒకటేమిటి? రకరకాల వాహనాలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆటో షో-2017 వేదికైంది. హైదరాబాద్  హైటెక్స్‌ లో రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించిన ఆటో షో భాగ్యనగర వాసులకు కనువిందు చేస్తోంది.

వింటేజ్ కార్ల దగ్గర్నుంచి ల్యాంబోర్గిని సూపర్ కార్ల వరకూ ఆటో షో లో కొలువుదీరాయి. వాటికితోడు రకరకాల బైకులను కూడా షోలో ప్రదర్శనకు ఉంచారు. ఖరీదైన వాహనాల దగ్గర కుర్రకారు సెల్ఫీలతో హడావుడి చేస్తున్నారు. పిల్లలను కూడా ఆటో షో ఆకట్టుకుంటోంది.

పాతిక లక్షల ఖరీదు చేసే బైకుల దగర్నుంచి ఐదు కోట్ల విలువైన లగ్జరీ కార్ల వరకు ఆటో షోలో ఉంచారు. జాగ్వర్, ఎంజీ, డోడ్గే బ్రదర్స్, షెవర్లే, ఫోర్డ్, ఫియట్, ఆస్టిన్, మెర్సిడస్ తదితర కంపెనీలకు చెందిన 150కి పైగా కార్లను ప్రదర్శిస్తున్నారు.

ఆటో షోలో వింటేజ్ వాహనాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. మోడ్రన్ కార్లు ఎన్ని వచ్చినా.. పాత తరం కార్ల స్టైలే వేరు! చెక్కుచెదరని నాణ్యత, రాజ వైభోగాన్ని తలపించే వింటేజ్ కార్లను చూడటానికి జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 1920 నుంచి 1967 మధ్య కాలంలో తయారైన వింటేజ్ కార్లన్నీ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. 1960 నాటి ట్రంప్‌ కంపెనీ కారుతో పాటు నార్టన్, రాజ్‌ దూత్, యెజ్డీ, వెస్పా బైక్‌లు కూడా సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.

వింటేజ్ కార్లు పిల్లలకు తెగ నచ్చేశాయి. స్టోర్ట్స్ బైకులను కూడా పిల్లలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. నేటితరానికి పాత తరం కార్లను పరిచయం చేస్తున్న ఆటో షో అద్భుతంగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. అటు పిల్లలు కూడా ఆటో షోను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.

ఆదివారం వరకు ఇంటర్నేషనల్ ఆటో షో కొనసాగుతుంది. వీకెండ్‌ కావడంతో ఆటో షోకు హైదరాబాదీలు క్యూ కడుతున్నారు.