అర్చక, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వం జీతభత్యాలు

రాష్ట్ర దేవాదాయశాఖ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. దేశంలో ఏ సీఎం కూడా తీసుకోలేకపోయిన సాహసోపేతమైన నిర్ణయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చారు.  అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు వేతన వ్యవస్థను ఏర్పాటు చేశారు. నేటి నుంచి దేవాదాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు, అర్చకులకు జీతభత్యాలను ఇవ్వనున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం డిసెంబర్ 1న దేవాదాయశాఖ పరిధిలోని 646 ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగులు జీతభత్యాలను అందుకోనున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనరేట్‌లో అర్చక ఉద్యోగ సదస్సును నిర్వహిస్తారు. రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపిక చేసిన అర్చకులకు, ఉద్యోగులకు వేతనాలను పంపిణీ చేస్తారు.

సెప్టెంబర్ 15న సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో అర్చక ఉద్యోగులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1నుంచి అర్చక ఉద్యోగులకు జీతభత్యాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ధార్మిక పరిషత్తును కూడా ఏర్పాటు చేసినట్లు ఆనాడు ప్రకటించారు. అంతకన్నా వేగంగా జీవో  నెంబర్‌ 577 ను జారీచేశారు. అందులోనే దేవాదాయశాఖలోని 646 దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులకు, ఉద్యోగులకు వేతన వ్యవస్థను ఏర్పరిచేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు. దేవాదాయశాఖ చట్టం -80/37, 33/2007చట్టం నిబంధనల ప్రకారం ధార్మిక పరిషత్తు మెంబర్ సెక్రటరీ, దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్ వేతన వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.

తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం అర్చకుడికి కనీస వేతనంగా రూ.25వేల వరకు లభించనున్నాయి. అదే ప్రకారం జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి రూ.25వేలు జీతభత్యాలుగా లభిస్తాయి. 2015 పీఆర్సీ ప్రకారం కనీసవేతనం, 24శాతం డీఏ ఇతర అలవెన్సులు లభించనున్నాయి. రాష్ట్రం  ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దేవాదాయశాఖకు 50 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించింది. ఇప్పటికే 646 దేవాలయాలలో అర్చక ఉద్యోగులకు జీతాలను చెల్లించేందుకు మరో  36 కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం.  ప్రస్తుతం ఈ దేవాలయాల ద్వారా వస్తున్న ఆదాయవనరులను పరిగణనలోకి తీసుకొని అవసరమైనన్ని నిధులు కేటాయించింది.  646 దేవాలయాలలోని ప్రతీ అర్చకుడికి, ప్రతీ ఉద్యోగికి జీతభత్యాలు లభించే విధంగా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వేతన వ్యవస్థకోసం దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తుమ్మలనాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ సభ్యులుగా ఉన్న ఈ ఉపసంఘం సెప్టెంబర్ 13న ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.

ఉపసంఘం నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. అధికారులు కమిటీని ఏర్పాటు చేశారు. అధికారుల కమిటీ పూర్తిస్థాయిలో ఆధ్యయనం చేసి నవంబర్‌ 27న కమిషనర్‌కు నివేదికను అందజేసింది. ఈ నివేదిక ప్రకారమే నేటి నుంచి 646 ఆలయాలలో ఉద్యోగులకు, అర్చకులకు జీతభత్యాలు ఇవ్వనుంది ప్రభుత్వం.