అభివృద్ధి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎల్‌ఈడీ లైట్ల బిగింపు ప్రక్రియ మరో రెండు నెలల్లో పూర్తి అవుతుందన్నారు మేయర్‌ బొంతు రామ్మోహన్‌. ఇప్పటికే అమర్చిన మూడు లక్షల 70 వేల ఎల్‌ఈడీ లైట్లతో.. విద్యుత్‌ పరంగా 14 కోట్లు జీహెచ్ఎంసీకి ఆదా అయ్యాయ‌న్నారు. మేయర్ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగింది. నగరంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, రోడ్ల విస్తరణ పనులకు మరింత వేగంగా భూసేకరణ, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

జీహెచ్ఎంసీలో 114 వార్డు క‌మిటీ స‌భ్యులు, 276 ఏరియా స‌భ స‌భ్యులను ఏక‌గ్రీవంగా నియ‌మిస్తూ సమావేశంలో తీర్మానించారు. అనంత‌రం జ‌రిగిన సాధార‌ణ స‌మావేశంలో స‌భ్యులు లేవ‌నెత్తిన 14 అంశాల‌పై సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. సమావేశంలో డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, ఎమ్మెల్సీలు స‌య్య‌ద్ అమీన్ ఉల్ జాఫ్రీ, ప్ర‌భాక‌ర్‌రావు, ఎమ్మెల్యేలు ప్ర‌భాక‌ర్‌, పాషాఖాద్రి, కార్పొరేట‌ర్లు, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.

సర్వసభ్య సమావేశంలో న‌గ‌రంలో చేప‌డుతున్న పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు, స్వ‌చ్ఛ ఆటోల ప‌నితీరు, స్వ‌చ్ఛ‌ దూత్‌ల నియామ‌కం, త‌డి-పొడి చెత్త విడ‌దీయ‌డం, డ్రై రిసోర్స్ సెంట‌ర్ల ఏర్పాటుపై దాదాపు గంట‌న్న‌ర‌సేపు చ‌ర్చించారు. స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌పై కార్పొరేట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌కు క‌మిష‌న‌ర్ జనార్దనరెడ్డి స‌మాధానం ఇచ్చారు. న‌గ‌రంలో ప్ర‌వేశ‌పెట్టిన 2 వేల స్వచ్ఛ ఆటోల ద్వారా దాదాపు 14 ల‌క్ష‌ల గృహాల నుండి చెత్త‌ను సేక‌రిస్తున్నామన్నారు. వీటికి అద‌నంగా మ‌రో 500 స్వ‌చ్ఛ ఆటో టిప్ప‌ర్ల‌ను వ‌చ్చే రెండు నెల‌ల‌లోపు సేక‌రిస్తామన్నారు.

ప్ర‌స్తుతం ఉన్న స్వ‌చ్ఛ ఆటో టిప్ప‌ర్ల ప‌నితీరుపై ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌మీక్షిస్తున్నామ‌ని, సుదీర్ఘంగా గైర్హాజ‌ర‌య్యే ఆటోడ్రైవ‌ర్ల నుండి స్వ‌చ్ఛ టిప్ప‌ర్ల‌ను స్వాధీన ‌పర్చుకుంటామన్నారు కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి. చెత్త సేక‌ర‌ణ‌కుగాను ఇంటింటి నుండి 50 రూపాయ‌ల‌ను స్వ‌చ్ఛ ఆటోల‌కు ఇవ్వడం వల్ల ఇంటి గృహిణిల‌కు, య‌జ‌మానుల‌కు ఆటోల ప‌నితీరుపై నియంత్రణ ఉంటుంద‌ని క‌మిష‌న‌ర్ అన్నారు. ప్ర‌తి ఇంటి నుండి చెత్త‌ను త‌డి, పొడిగా విడ‌దీసేవిధంగా  చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి న‌గ‌రంలో స్వ‌చ్ఛ దూత్‌ల‌ను ప్ర‌త్యేకంగా నియ‌మిస్తున్నామ‌న్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో రోడ్ల విస్త‌ర‌ణ‌, ఎస్‌.ఆర్‌.డి.పి ప‌నుల‌ను చేప‌ట్టేందుకుగాను భూ, ఆస్తుల సేక‌ర‌ణ‌ను త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ అధికారులను ఆదేశించారు. టౌన్‌ ప్లానింగ్ విభాగంలో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీచేయ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు మేయ‌ర్ చెప్పారు. వివిధ ప్రాంతాల్లో భూ సేక‌ర‌ణ‌కుగాను ఇప్ప‌టికే అందజేసిన చెక్‌ల‌కు సంబంధించిన ఆస్తుల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని కోరారు.

బాలాపూర్‌, డీ.ఆర్‌.డి.ఎల్ మీదుగా చాంద్రాయ‌ణ‌గుట్ట వ‌ర‌కు వంద ఫీట్ల మేర రోడ్డు విస్త‌ర‌ణ చేప‌డతామ‌ని, అదేవిధంగా బ‌హ‌దూర్‌పుర ఫ్లై ఓవ‌ర్‌ను 37కోట్లు ఖర్చు చేసి విస్త‌రించడంతో పాటు ప‌లు కారిడార్ల ఏర్పాటుకు అధ్యయ‌నం జ‌రుగుతోంద‌న్నారు. రోడ్ల నిర్మాణంలో విధిగా 50 మిల్లీమీటర్ల మేర మిల్లింగ్‌ను చేప‌డతామని సమావేశానికి మేయర్‌ తెలియజేశారు. న‌గ‌రంలో 50 మైక్రాన్ల క‌న్నా త‌క్కువ ఉన్న ప్లాస్టిక్ క‌వ‌ర్ల వాడ‌కాన్ని నిషేధించామ‌ని, దీన్ని ఉల్లంఘించిన 3 వేల 746  మందికి 37 లక్షల 62 వేల జ‌రిమానాలు విధించిన‌ట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

ఈస్ట్‌ జోన్ ప‌రిధిలోని న‌ల్ల‌చెరువు, నాగోల్ ఊర చెరువు, పెద్ద చెరువు, ప‌టేల్ చెరువుల‌ను అభివృద్ధి చేయ‌డం, గుర్ర‌పుడెక్క ఆకు తొల‌గింపునకు కోటీ 82 లక్షల 42 వేలను కేటాయించిన‌ట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు  తెలిపారు. న‌గ‌రంలో అధికారిక కార్య‌క్ర‌మాల‌పై క‌చ్చితంగా ప్రోటోకాల్ పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను మేయ‌ర్ ఆదేశించారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో కార్పొరేట‌ర్లు బ‌స్తీ బాట, అపార్ట్‌మెంట్లను సందర్శిస్తున్నారని మేయర్‌ రామ్మోహన్‌ చెప్పారు. ప్ర‌జ‌ల నుండి అందిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌ర్కిల్ స్థాయిలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలన్నారు మేయ‌ర్ రామ్మోహన్‌.