అందరికి చాటిచెప్పేల తెలుగు మహాసభలను నిర్వహించాలి

ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. తెలుగు-వెలుగును అందరికీ చాటిచెప్పేలా మహాసభలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిసెంబర్ 15 నుంచి హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ రివ్యూలో పాల్గొన్నారు. సీఎస్‌ ఎస్పీ.సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు.

తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్న సాహితీవేత్తలందరినీ మహాసభలకు పిలవాలన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు తెలుగు భాష మాట్లాడే సీఎంలు, గవర్నర్ లాంటి ప్రముఖులను ఆహ్వానించాలని చెప్పారు. తెలుగుతో పాటు ఇతర గుర్తింపు పొందిన భారతీయ భాషలకు చెందిన సాహితీ వేత్తలను కూడా గౌరవించి.. సన్మానించాలని సూచించారు. సభల ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మారిషస్ వైస్ ప్రెసిడెంట్ పరమ శివమ్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరవుతారని తెలిపారు. తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కూడా ఆహ్వానించాలని సూచించారు. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వస్తారని చెప్పారు సీఎం.

తెలుగు మహాసభల ప్రధాన వేదిక ఎల్.బి.స్టేడియం వేదిక డిజైన్ ను పరిశీలించారు సీఎం కేసీఆర్. అటు నగరంలో ఏర్పాటు చేయాల్సిన తోరణాల డిజైన్లను కూడా పరిశీలించి.. ఆమోదించారు. ప్రారంభ, ముగింపు సభలు రెండూ ఎల్బీ స్టేడియంలోనే నిర్వహించాలన్నారు సీఎం కేసీఆర్. ప్రముఖులతో పాటు పండితులు, సాహిత్యాభిమాలు పెద్దఎత్తున తరలివస్తారు కాబట్టి భద్రతా, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రతీ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలన్నారు. అక్కడ సాహితీ సభలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ వంటకాల పేరుతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు  చేయాలన్నారు. వివిధ కళా ప్రక్రియలకు సంబంధించిన స్టాళ్లు కూడా నిర్వహించాలన్నారు. తెలంగాణ ఆహార్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం ప్రతిబింబించే లేజర్ షో నిర్వహించాలన్నారు. చివరి రోజు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చాలన్నారు సీఎం కేసీఆర్.

తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్  నగరమంతా అందమైన అలంకరణలుండాలన్నారు సీఎం కేసీఆర్. నగరం పండుగ శోభను సంతరించుకోవాలని.. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జంక్షన్లను అలంకరించి.. తెలుగు సాహితీ మూర్తుల పేర్లతో తోరణాలుండాలని చెప్పారు. సభల సందర్బంగా తెలుగు భాషాభివృద్ది కోసం కృషి చేస్తున్న సంగీత, సాహిత్య, కళా రంగాలకు చెందిన ప్రముఖులను గౌరవించుకోవాలన్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నగరాల మేయర్లు, సివిల్ సర్వీస్ అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లను మహాసభలకు ఆహ్వానించాలన్నారు సీఎం కేసీఆర్. పోస్టల్ శాఖ సమన్వయంతో తెలుగు మహాసభల సందర్భంగా ప్రత్యేక స్టాంపులను విడుదల చేయాలన్నారు. సానియా మీర్జా, సైనానెహ్వాల్, మిథాలీరాజ్, పివి సింధు  లాంటి క్రీడాకారులను కూడా మహాసభలకు ఆహ్వానించాలని సూచించారు. తెలుగు పండుగలు, సంవత్సరాలు, నెలలు, కార్తెలతో కూడిన పుస్తకాన్ని ముద్రించి మహాసభల సందర్భంగా పంపిణీ చేయాలన్నారు సీఎం కేసీఆర్.