అంతరిక్షంలో పిజ్జా తయారీ!

అంతరిక్షంలో పిజ్జా తయారుచేశారు! అదెలా అనుకుంటున్నారా? కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న పౌలో నెస్పోలి అనే ఇటాలియన్‌ వ్యోమగామి అంతరిక్షంలో పిజ్జాలు తయారుచేస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఐఎస్‌ఎస్‌ అధికారులతో చర్చించారు.

ఈ ఐడియా వారికీ నచ్చినట్టుంది. ఐఎస్‌ఎస్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న కిర్క్‌ షైర్‌మ్యాన్‌.. నవంబర్‌ నెలలో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ అంతరిక్షంలో ఉన్న తమ వ్యోమగాములకు పంపించారు. దాన్ని చూసి వ్యోమగాములు సర్‌ప్రైజ్‌ అయ్యారు. వెంటనే తామెంతగానో మిస్‌ అయిన పిజ్జాను తయారుచేసుకుని లొట్టలేసుకుంటూ తినేశారు. ఈ వీడియోను నాసాకి చెందిన జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌ యూట్యూబ్‌లో విడుదల చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అంతరిక్షంలో, భార రహిత స్థితిలో పిజ్జాలు తయారుచేయడమంటే మాటలు కాదు.. చాలా కష్టంతో కూడుకున్న పని. మొదట ఐఎస్‌ఎస్‌ సిబ్బంది కంగారు పడ్డారట. కానీ వారు వూహించినదానికంటే మరింత రుచికరంగా పిజ్జాలు వచ్చాయని తమ వ్యోమగాములు చెప్పారని నెస్పోలి తెలిపారు. పిజ్జాతో పాటు ఐస్‌క్రీంకు కావాల్సిన పదార్థాలను అంతరిక్షంలోకి పంపించారట.