అండర్ గ్రౌండ్ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా సీఎం కేసీఆర్ ఉదయం పెద్దపల్లి జిల్లా మేడారం, కరీంనగర్ జిల్లా రామడుగు ప్రాంతాల్లో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 6, ప్యాకేజీ 8లో భూగర్భంలో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సొరంగాలు, పంప్ హౌస్‌లు, సర్జ్ పూల్స్, సబ్ స్టేషన్లు, స్విచ్ యార్డులను సీఎం పరిశీలించారు. మేడిగడ్డ దగ్గర ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి వస్తుంది. ఎల్లంపల్లి నుంచి 9.53 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా మేడారం గ్రామ పరిధిలోని భూగర్భ సర్జ్ పూల్‌ కు చేరుతుంది. ఈ సొరంగాన్ని పది డయామీటర్ల డీ ఆకారపు వ్యాసార్థంలో నిర్మించారు. ఈ నిర్మాణ పనులన్నింటినీ సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించారు.

మేడారం సర్జ్ పూల్ చేరిన నీటిని మేడారం చెరువులోకి పంపడానికి 124.5 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంపులను ఏర్పాటు  చేసినట్టు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు ముఖ్యమంత్రికి వివరించారు. అడవులు, కొండలు, గుట్టలున్న ప్రాంతం కావడంతో మేడారంలో 400 మెగావాట్ల సామర్థ్యం గల సబ్ స్టేషన్ ను కూడా భూగర్భంలో నిర్మించినట్టు సీఎండీ తెలిపారు. పంపుసెట్ల తయారీ బాధ్యతలు తీసుకున్న బీహెచ్ఈఎల్ అధికారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. మొత్తం ఏడు పంపులకు గాను వచ్చే జూన్‌ లోగా రెండు పంపులను బిగిస్తామని, మిగతావి డిసెంబర్ నాటికి అందిస్తామని బీహెచ్‌ఈఎల్‌ జీఎం సుందరరాజన్‌ సీఎంకు తెలిపారు.

కన్నెపల్లి దగ్గర నీటి పంపింగ్ జరిగిన తర్వాత అన్నారం, సుందిళ్ల ద్వారా మేడారం వరకు చేరే నీటిని 105 మీటర్ల మేర లిఫ్ట్ చేయడం అత్యంత ముఖ్యమైన ఘట్టమని సీఎం కేసీఆర్ చెప్పారు. వేసవిలోగా అన్ని పనులు పూర్తి చేసి నీటి లిఫ్ట్‌కు, పంపింగ్‌కు సిద్ధం కావాలన్నారు. మేడారం నుంచి రామడుగు వరకు జరుగుతున్న పనులను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించారు. మంత్రి హరీష్ రావు, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, సీఈ వెంకటేశ్వర్లు పనుల పురోగతిని సీఎంకు వివరించారు. మేడారం నుంచి లక్ష్మీపూర్ వరకు 15 కిలోమీటర్ల టన్నెల్‌ను, 5.7 కిలోమీటర్ల కెనాల్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. లక్ష్మీపూర్ దగ్గర పంప్‌హౌస్‌ను పరిశీలించారు. లక్ష్మీపూర్ దగ్గర నీటిని లిఫ్ట్ చేయడానికి 139 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంపులు ఏర్పాటు చేస్తున్నామని.. వాటిని నడిపించడానికి అవసరమైన 973 మెగావాట్ల విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ ప్రభాకర్ రావు ముఖ్యమంత్రికి వివరించారు.

మేడారం, లక్ష్మీపూర్ ద్వారా లిఫ్టు చేసిన నీటిని వరద కాల్వలో 99వ కిలోమీటర్ వద్ద కలపాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి రోజు 2 టీఎంసీల నీటిని పంప్ చేయడానికి ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నుంచి వీలైనంత మేర నీటిని గోదావరి నుంచి తీసుకోవాలన్నారు. వరద కాల్వ ద్వారా ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి, మరో టీఎంసీని మిడ్ మానేరుకు పంపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వరద కాల్వ దాకా నీరు చేరే ప్రక్రియ కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైందని వివరించారు. అన్ని పనులు సమాంతరంగా, పటిష్టంగా చేపట్టి.. సకాలంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. పనులను పరిశీలించే సందర్భంగా అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. నిర్మాణాలపై వారికి కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.