2,200 మంది పోలీసులతో జీఈఎస్ కు భద్రత

ఈ నెల 28 నుంచి హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు 2,200 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ వి.వి.శ్రీనివాస రావు చెప్పారు. హోం గార్డ్ నుండి కమిషనర్ స్థాయి వరకు అందరూ ఆన్ డ్యూటీలో ఉంటారని అన్నారు. ఈ సదస్సు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక వస్తున్న నేపథ్యంలో భద్రతకు సంబంధించిన వివరాలను బషీర్ బాగ్ లోని కార్యాలయంలో సీపీ వెల్లడించారు.

ఈ నెల 28 తేదీన ప్రధాని మోడి మియాపూర్ లో హైదరాబాద్ మెట్రోరైలు  ప్రారంభోత్సవానికి హాజరు అవుతున్నారని సీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకునే ప్రధాని మోడి, అక్కడి నుంచి మియాపూర్ వరకు హెలికాప్టర్ లో వెళ్తారని చెప్పారు. అంతర్జాతీయ సదస్సుకు ప్రధాని, ఇవాంక ట్రంప్ తో పాటు 100 మంది అమెరికా ప్రత్యేక అతిథులు హాజరు అవుతున్నారని, రెండు వేల మంది వివిధ దేశాల ప్రతినిధులు రానున్నారని తెలిపారు.

ఇవాంకతో పాటు సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు భారత ప్రభుత్వం ఫలక్ నుమా ప్యాలెస్ లో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నదని సీపీ శ్రీనివాసరావు చెప్పారు. ప్రధాని ఫలక్ నుమా ప్యాలెస్ లో రెండు గంటలపాటు ఉండే అవకాశం ఉందన్నారు. ప్రతినిధులను మాదాపూర్ లోని హెచ్ఐసిసి నుంచి ఫలక్ నుమాకి గంటన్నరలో తీసుకురావడానికి పక్కా ప్రణాళిక తయారు చేశామన్నారు. దూద్ ఖాన్ లో 40 బస్సులు , ఫలక్ నుమా గుట్టపై 55 బస్సుల పార్కింగ్ కి ఏర్పాటు చేశామని చెప్పారు.

28, 29 తేదీల్లో సదస్సుతో పాటు పలు కార్యక్రమాల్లో ఇవాంక పాల్గొనే అవకాశం ఉందని సీపీ వెల్లడించారు. వీరి భద్రతపై ఎల్ఎస్ డబ్ల్యు, యుఎస్ సీక్రెట్ సర్వీస్ వారితో  ఇంటర్నల్ మీటింగ్ లో చర్చించామన్నారు.

సదస్సుకు వచ్చే ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో 29 తేదీన డిన్నర్ ఏర్పాటు చేసిందని సీపీ వెల్లడించారు. రాణి మహల్ హాల్ లో సాంస్కృతిక కార్యక్రమాలు, డిన్నర్ ఉంటుందన్నారు.