2018లో భూమిపై భారీ విధ్వంసం జరగబోతోందా?

2018లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా భారీ భూకంపాలు సంభవించే అవకాశాలున్నట్లు భౌగోళిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  సాధారణంగా  ఏడాదిలో 15 నుంచి 20 వరకు తీవ్రస్థాయిలో భూకంపాలు సంభవిస్తే 2018లో  మాత్రం 25 నుంచి 30 వరకు భారీ తీవ్రతతో సంభవిస్తాయని అంటున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ కొలరాడో, యూనివర్శిటీ ఆఫ్‌ మోంటానాకి చెందిన శాస్త్రవేత్తలు రాబర్ట్‌ బిల్హామ్‌, రెబెక్కాలు 1900 కాలం నుంచి ఇప్పటివరకు 7 తీవ్రతతో సంభవించిన భూకంపాలపై పరిశోధన చేశారు. భూభ్రమణ వేగం ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడే ఇంతటి తీవ్రతతో భూకంపాలు సంభవించినట్లు పరిశోధనలో తేలింది. అది కూడాజనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే సంభవించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

రోజూ ప్రతి అరక్షణానికి భూభ్రమణ వేగం మారుతుంటుంది. వేగం మరింత ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 32 ఏళ్లకోసారి భారీ తీవ్రతతో భూకంపాలు వస్తుంటాయన్నారు. భూభ్రమణ వేగం ప్రతి ఐదేళ్లకోసారి మారుతుంటుందని.. గత నాలుగేళ్లుగా భూభ్రమణ వేగం తక్కువగానే ఉందన్నారు. కాబట్టి ఈ నాలుగేళ్ల కాలంలో ఏటా సగటు పెద్ద 15 భూకంపాలు వచ్చాయని చెప్పారు. 2018కి ఐదో సంవత్సరం అవుతుంది కాబట్టి భూభ్రమణ వేగం పెరిగి 20 నుంచి 30 వరకు భారీ భూకంపాలు ఏర్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. భూ కంపాలు వస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేసినా.. అవెక్కడ వస్తాయన్న విషయంపై మాత్రం స్పష్టత లేదంటున్నారు. కాబట్టి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించొచ్చంటున్నారు.