చేనేత కార్మికుల కోసం మరో పథకం

నేతన్నల కోసం ఇప్పటికే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి కె.టి. రామారావు తెలిపారు. చేనేత కార్మికులకు ‘యార్న్ సబ్సిడీ పథకం’ ఈ నెల 18వ తేదీన వరంగల్ లో ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

చేనేత సహకార సంఘంలోని సొసైటీలు, కార్మికులు కొనుగోలు చేసే నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 20 శాతం సబ్సిడీని మాత్రమే ఇస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేత కార్మికుల ఆదాయాన్ని పెంచే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ మేరకు నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 20 శాతం నుంచి 40 శాతానికి  పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10 శాతం సబ్సిడీ కూడా ఎప్పటిలాగానే లభిస్తుందని వివరించారు.

ఈ పథకంతో చేనేత, అనుబంధ కార్మికులకు 35 శాతం అదనపు ఆదాయం లభిస్తుందని, ఆయా సొసైటీలకు 5 శాతం ఆదాయం సమకూరుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ పథకం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ర్టంలోని సుమారు 35 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని  మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తీసుకుంటున్న చర్యలపైన మంత్రి కేటీఆర్ టెక్స్ టైల్స్ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.