14 వెల్ నెస్ సెంటర్లలో లక్షల మందికి ఉచిత చికిత్స

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, జర్నలిస్టులకు ఉచిత చికిత్స అందించేందుకు రాష్ట్రంలో 14 వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఉద్యోగులు, పింఛనుదారులు, జర్నలిస్టుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత వైద్యం అందిస్తున్నామని వివరించారు. ఈ వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ఎంతో మంది చికిత్స పొందుతున్నారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వెల్‌నెస్ సెంటర్ల ద్వారా అన్ని రకాల వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఈవోని, వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

హైదరాబాద్ పాతబస్తీలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. త్వరలోనే మరిన్ని చోట్ల వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. సంగారెడ్డి, వరంగల్‌లో రెండు, మూడు రోజుల్లోనే వెల్‌నెస్ సెంటర్లను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్‌లో 1,63,109 మందికి చికిత్స అందించామని మంత్రి వివరించారు. జిల్లా కేంద్రాలు, టీచింగ్ ఆస్పత్రుల్లోనూ సీటీ స్కాన్, ఎమ్మారై సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి వాటికోసం ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించాల్సిన అవసరం లేదన్నారు.