హై సెక్యూరిటీ జోన్ లో హైదరాబాద్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన కోసం భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నగర వ్యాప్తంగా  హై సెక్యూరిటీ కల్పించారు. ఓ లేడీ ఐపీఎస్ అధికారినిని ఆమెకు ప్రత్యేక భద్రతా అధికారిగా నియమిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రత్యేక నిఘా ఉపగ్రహం హైదరాబాద్‌ నగరాన్ని ప్రతీక్షణం పర్యవేక్షిస్తోంది. ఇవాంక ట్రంప్‌ పర్యటన ముగిసే వరకు ఈ నిఘా కొనసాగనుంది. యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ఆ శాటిలైట్‌ అందించే చిత్రాలను విశ్లేషించడానికి వెస్టిన్‌ హోటల్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ పోస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ సైతం  కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి అడ్వాన్స్ట్ సెక్యూరిటీ లైజన్‌ పేరుతో సిఎస్ సమీక్షంలో సమావేశాలు జరుపుతున్నారు.

మరోవైపు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ  నాసా ఆ దేశ భద్రతావసరాల కోసం ప్రత్యేకంగా ఓ శాటిలైట్‌ను ప్రయోగించింది. అక్కడి హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఆధీనంలో ఈ ఉపగ్రహం పని చేస్తుంది. ఇవాంక పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఉపగ్రహాన్ని హైదరాబాద్‌ వైపు మళ్ళించారు. ప్రధానంగా ఇవాంక బస చేసే వెస్టిన్‌ హోటల్, హెచ్‌ఐసీసీ ఉన్న మాదాపూర్, అధికారిక విందు జరిగే ఫలక్‌నుమా ప్యాలెస్‌లతో పాటు ఆ చుట్ట పక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఈ ఉపగ్రహం ప్రత్యేక నిఘా వేసి ఉంచుతుంది. హై రిజల్యూషన్‌ కెమెరాలతో ఫొటోలు తీయడం దీని ప్రత్యేకత. వీటిని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఇవాంకకు భద్రత కల్పించే యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వెస్టిన్‌ హోటల్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ పోస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఛాయాచిత్రాలను అమెరికాలోని హోంల్యాండ్‌ సెక్యూరిటీ ప్రధాన కేంద్రం నుంచి విశ్లేషించనున్నారు.

అలాగే ఇవాంక ట్రంప్‌ కాన్వాయ్‌లో వినియోగించడానికి ప్రత్యేకంగా నాలుగు వాహనాలను సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు హైదరాబాద్‌ తీసుకువచ్చారు. ఇవాంక ప్రయాణించే ప్రత్యేక కారు, కమ్యూనికేషన్, నిఘా తదితర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో కూడా మరో వాహనం సిటీకి చేరుకున్నాయి. ఇవాంక వాహనం వెనుక ఉండే ఫస్ట్‌ ఎస్కార్ట్, సెకండ్‌ ఎస్కార్ట్‌ వాహనాలను ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ నాలుగు వాహనాలు అమెరిక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల పర్యవేక్షణలో ఓ రహస్య ప్రాంతంలో దాచి ఉంచారు.. ఇవాంక వినియోగించే కారు అనుధార్మికత ఉన్న ఆయుధాల దాడుల్నీ తట్టుకునే శక్తి ఉంది.

ఇవాంక బస చేయనున్న వెస్టిన్‌ హోటల్‌లో మూడు అంతస్తులు ఎస్‌ఎస్‌ ఏజెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ పని చేసే ఉద్యో గులు, బస చేస్తున్న, చేయనున్న వారు, చుట్టు పక్కల నివసించేవారు, కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల పూర్తి వివరాలను సేకరించారు. ఈ వివరాలను కేంద్ర నిఘా వర్గాలతో కలసి విశ్లేషిస్తున్నారు. ఎలాంటి చిన్న రిమార్క్ ఉన్నా..వారిని విధులకు దూరంగా ఉంచుతారు. ఆయా ప్రాంతా ల్లో ఏఏ ఉద్యోగులు విధులు నిర్వర్తించాలో ఖరారు చేసి వారికీ గుర్తింపుకార్డులు జారీ చేయనున్నారు.  హెచ్‌ఐసీసీలో , తాజ్‌ ఫలక్‌నుమలో జరిగే విందుకు హాజరయ్యే కార్యక్రమాలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఐతే ఇప్పటి వరకు చార్మినార్, గోల్కొండ పర్యటనలపై హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి క్లియరెన్స్‌ రాలేదు. ఇక ఇవాంకను కలిసే అతిథులతో పాటు ఆమెకు అందించే బహుమతులపై కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి.

ఇవాంక పర్యటనకు ఎస్‌ఎస్‌ అధికారులు, ఎస్పీజీ బలగాలు మొత్తం ఐదంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నాయి. తొలి రెండు అంచెల్లో ఎస్‌ఎస్‌ ఏజెంట్లు, ఎఫ్‌బీఐ అధికారులు ఉంటారని తెలుస్తోంది.. మూడు, నాలుగు అంచెలు ఎస్పీజీ, కేంద్ర నిఘా వర్గాల ఆధీనంలో ఉండనున్నాయి. స్థానిక పోలీసులు ఐదో అంచెలో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇలా విధులు నిర్వర్తించే అధికారులకూ అమెరికన్‌ ఎస్‌ఎస్‌ ఏజెంట్ల ప్రత్యేక గుర్తింపుకార్డులు జారీ చేయనున్నారు. వీటి కేటగిరీని బట్టి నిర్ణీత ప్రాంతాలకే అనుమతిస్తారు. ఇజ్జత్‌నగర్, ఖానామెట్, ఇజ్జత్‌నగర్‌ వీకర్‌ సెక్షన్‌లలో ఉండే వాహనదారులకు పోలీసులు పాసులు జారీ చేయనున్నారు. ఆ పాసులున్న వాహనాలను మాత్రమే హైటెక్స్‌ కమాన్‌ నుంచి లోపలికి అనుమతిస్తారు. ఇవాంక సెక్యూరిటీ సర్వీస్ బృందానికి  మార్వెల్‌గా పేరు పెట్టుకుంది. ఆ సెక్యూరిటీలో హైదరాబాద్‌కు 36 మంది భద్రతాధికారులు వస్తున్నారు. వీరిలో బయట విధుల్లో 18 మంది సీక్రెట్‌ సర్వీసెస్‌ భద్రతాధికారులు ఉండగా, డెలిగేట్ల రూపంలో మరో 18 మంది సదస్సులో వివిధ ప్రాంతాల్లో నిమగ్నం కానున్నారు.  మొత్తానికి ఇవాంకకు కల్పిస్తున్న సెక్యూరీటి మొత్తం హైదరాబాద్ నే ఫోకస్ చేస్తుంది.  నిఘా వర్గాల హెచ్చరికలతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.