హిమాచల్ లో 74 శాతానికి పైగా పోలింగ్

హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగిసింది. ఎలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేకుండా పోలింగ్ పూర్తయ్యింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ బూత్‌ ల వద్ద బారులు తీరారు. భారీగా మంచు, చలి ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. గత కొన్ని దశాబ్దాల తర్వాత హిమాచల్‌ లో 74 శాతానికి పైగా ఓటింగ్ నమోదవటం ఇదే తొలిసారి. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించిన పార్టీలకు, అధికారులకు, ఓటర్లకు ఎన్నికల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.

ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిమ్లాలోని పోలింగ్ బూత్ లో కుటుంబంతో పాటు ఓటేశారు సీఎం వీరభద్ర సింగ్. మరోసారి హిమాచల్ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం గడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీరభద్ర సింగ్ వెంబడి.. ఆయన కుమారుడు విక్రమాదిత్య కూడా ఉన్నారు.

హమీర్ పూర్ లో ఓటు వేశారు బీజేపీ సీఎం అభ్యర్ధి ప్రేమ్ కుమార్ ధుమాల్. బీజేపీకి 50 నుంచి 60 సీట్లు ఖాయమన్నారు. ప్రేమ్ కుమార్ తో పాటు ఆయన కుమారుడు, ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా ఓటు వేశారు. హిమాచల్ ప్రదేశ్ కు ధుమాల్ లాంటి సీనియర్ నాయకుడి నాయకత్వం అవసరమని, ప్రజలు బీజేపీకే అధికారం ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పలువురు మంత్రులు, మాజీ మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఓటు వేశారు. భారత తొలి ఓటరైన శ్యామ్ శరణ్ నేగీ… కిన్నోర్‌ నియోజకవర్గంలో ఓటు వేశారు. ప్రతి పౌరుడు బాధ్యతగా తమ ఓటు వేసి… ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు.

హిమాచల్‌ ప్రదేశ్ లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని స్థానాలకు పోటీ పెట్టారు. అన్ని పార్టీల తరఫున దాదాపు 338 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఐతే, వీరిలో 19 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మొత్తం 7 వేల 5 వందల పోలింగ్ బూత్‌ లను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు.

భారీగా పోలింగ్ నమోదవటంపై బీజేపీ సంతోషంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగినట్లు ఆ పార్టీ చెబుతోంది. అటు కాంగ్రెస్ సైతం మళ్లీ తమదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తోంది. హిమాచల్ రాజకీయ చరిత్ర చూస్తే గత కొన్నేళ్లుగా ఒకే పార్టీ రెండుసార్లు అధికారంలోకి రాలేదు.