స్వరూపాన్ని కోల్పోతున్న భూమి

భూమి తన స్వరూపాన్ని కోల్పోతోంది.  వేడెక్కుతున్న వాతావరణంతో భూ ఉపరితలంపై అనేక మార్పులు వస్తున్నాయి.  పుడమిపైనున్న మహా సముద్రాలు, మత్స్య సంపద, పంటలు, అడవులు, ఆర్కిటిక్‌ ప్రాంతం అన్నీ సహజత్వాన్ని కోల్పోతున్నాయి.  ఒకటేమిటీ? రెండు దశాబ్దాలుగా భూమిపైనున్న సర్వం మార్పు చెందుతోంది. గడిచిన రెండు దశాబ్దాల్లో భూమి రూపురేఖల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. భూఉపరితలానికి సంబంధించి నాసా విడుదల చేసిన ఓ వీడియో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

వివిధ ఉపగ్రహాల నుంచి సేకరించిన దృశ్యాలన్నింటినీ ఒకదగ్గరకు కూర్చి రూపొందించిన కొన్నినిమిషాల వీడియో 20ఏండ్లలో భూమిపై సంభవించిన దీర్ఘకాలిక మార్పుల్ని స్పష్టంగా చూపించింది. 1997 నుంచి నాసా శాటిలైట్లు భూమిని స్పష్టంగా చిత్రీకరించడం ప్రారంభించాయి. అప్పటినుంచి 2017వరకు నమోదైన భూ ఉపరితల మార్పుల్ని ఈ వీడియో కండ్లకు కట్టినట్లు చూపించింది. వసంతకాలంలో ఉత్తరార్ధగోళంలోని పర్యావరణం కొత్త ఆకులు తొడగడంతోపాటు భూమి క్రమంగా పచ్చదనాన్ని సంతరించుకోవడాన్ని ఉపగ్రహాలు రికార్డు చేశాయి. ఆర్కిటిక్ ప్రాంతం 20ఏండ్లలో ఆకుపచ్చగా మారిపోయింది. వేడెక్కుతున్న వాతావరణం కారణంగా మొక్కల పెరుగుదల ఎక్కువై ఉంటుందని భావిస్తున్నారు. కేవలం దృశ్యమాత్రంగానే కాకుండా ఉపగ్రహ సమాచారం ఆధారంగా ఐదు మహాసముద్రాల పరిధిలో సూక్ష్మ మొక్కలు గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు..

ఆర్కిటిక్ నుంచి అమెరికా వరకు సూక్ష్మ సముద్ర మొక్కలు విస్తరించాయని నాసా వీడియోలో తేలింది. భూగోళంపై పంటలు, అడవులు, మత్స్యసంపద ఎలా మార్పులకు గురయ్యాయో ఈ దృశ్యాల్లో గమనించవచ్చు. నీటిలోపలి సూక్ష్మమొక్కలు కార్బన్‌డయాక్సైడ్‌ను తీసుకుని క్రమంగా విస్తరించడం వల్ల సముద్ర ఉపరితలం రంగులు మారుతుండడం కనిపించింది. వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ కారణంగా ఉష్ణోగ్రతలు వృద్ధి చెందుతున్న తరుణంలో భూమి ఉపరితల మార్పుల్ని కొత్తకోణంలో విశ్లేషించడానికి రెండుదశాబ్దాల ఉపగ్రహ సమాచారం ఉపయోగపడనున్నది..