సీఎం కేసీఆర్ నాయకత్వానికి అందరి మద్దతు

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేయడానికి అందరూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అందరం ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలన్నారు. టిఆర్ఎస్ లో చేరుతున్నవాళ్లంతా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారని చెప్పారు. టీడీపీ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాల అధ్యక్షులు, పలువురు నేతలు, వేల మంది కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉందని కడియం శ్రీహరి చెప్పారు. అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలన్నది సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ మన ప్రాంతాల అభివృద్ధికి కృషిచేద్దామని సూచించారు. టిఆర్ఎస్ లో చేరిన గండ్ర సత్యనారాయణ రావు, ఇతర నేతలకు పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని కడియం భరోసా ఇచ్చారు.

తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు రాజకీయ పునరేకీకరణ జరగాలని సీఎం కేసీఆర్ చెప్పిన్రని, ఇప్పుడు అదే జరుగుతోందని డిప్యూటీ సీఎం కడియం అన్నారు. తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నందుకు తాను కూడా ఆనాడు టీడీపీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరానని గుర్తుచేశారు. ఆత్మహత్యలు లేని ఆకుపచ్చని తెలంగాణను నిర్మించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు.

బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతిబసు రికార్డును తిరగరాసే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు జార్ఖండ్ లో ఆర్జేడీ అంతర్థానమైనట్టు తెలంగాణలో కూడా టీడీపీ కథ ముగిసిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ కూడా తెరమరుగయ్యిందని తెలిపారు. టీఆర్ఎస్‌లో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.

సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, టీడీపీ నేతలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. భూపాలపల్లి జిల్లా ప్రజలకు పక్కన గోదావరి ఉన్నా.. నీరు రాని పరిస్థితి ఉందన్నారు. బోర్డు వేసీవేసీ తెలంగాణ బోర్లా పడ్డది. తలాపున గోదారి పారుతున్నా ఎడారిగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అర్ధరాత్రి కరెంట్ ఇస్తే పొలాల దగ్గరికి పోయినోళ్లు పాముకాటుతో, కరెంట్ షాక్ తో చివరికి నక్సలైట్ల పేరుతో చనిపోయారని ఈటెల గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు.

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులతో ప్రతి ఎకరానికి గోదావరి నీళ్లు అందిస్తామని మంత్రి ఈటెల తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రెండు పంటల కోసం ప్రతి ఎకరానికి రూ. 8 వేల పెట్టుబడి ఇస్తామన్నారు. ఉద్యమంలో కేసీఆర్ కు అండగా ఉన్నట్లే..  ప్రభుత్వానికి కూడా అండగా ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు.

తెలంగాణ సాధించడం ఉద్యమంలో ఒక భాగం మాత్రమేనని, పునర్నిర్మాణ ఉద్యమం సాగుతోందని కరీంనగర్ ఎంపీ వినోద్‌ కుమార్ చెప్పారు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. తెలంగాణ సాధనతోనే పని అయిపోలేదని, అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. ప్రజా సమస్యలను కార్యకర్తలు నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారని టిఆర్ఎస్ లో చేరిన గండ్ర సత్యనారాయణ అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు.