సీఎం కేసీఆర్ డిమాండ్ కు పెరుగుతున్న మద్దతు

సంకల్ప శుద్ధికి ఆత్మవిశ్వాసం తోడైతే అసాధ్యమన్నది సుసాధ్యమవడం తథ్యం..! వేల మైళ్ళ ప్రయాణానికైనా ఆరంభం ఒక్క అడుగే..! ప్రళయ భీకరమైన జడివానకు సైతం ఆరంభం ఒక్క చినుకే..! పదహారేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం అంటే సమైక్య నాయకులు ఫక్కున నవ్వారు..! మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అన్నారు. అయినా సరే, స్వరాష్ట్రం సాధిస్తామన్న నమ్మకం సడలిపోలేదు. ఒక్కటై లేచిన పిడికిలి, ఒక్కటై నినదించిన గొంతుక తెలంగాణ యావత్ సమాజాన్నికదిలించింది. ఆ ఒక్క పిడికిలే, ఆ ఒక్క నినాదమే కోట్లాది హృదయాలను తట్టి లేపింది..! ఇంతింతై వటుడింతై అన్నట్టు మహోగ్ర ఉద్యమంగా మారింది..! తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించింది..! అందుకే తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్…అనితర సాధ్యుడు… అనన్యసామాన్యుడు..!

స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన తర్వాత ఉద్యమస్పూర్తితోనే సాగుతున్న సీఎం కేసీఆర్ పాలన ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. మూడున్నరేండ్లలోనే ఎన్నో రంగాల్లో తెలంగాణ సగర్వంగా తలెత్తుకు నిలిచింది. రాష్ట్రమొస్తే చిమ్మచీకట్లు తప్పవన్న నాటి నాయకుల అపోహలకు సీఎం కేసీఆర్‌ పాలన మూథోడ్ సమాధామనమిచ్చింది. చిమ్మచీకట్లను చీల్చుకుంటూ వెలుగు బావుటా ఎగరేసింది. విద్యుత్ కొరత రాష్ట్రం నుంచి విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఎదిగింది. 24 గంటల ఉచిత కరెంట్ అన్న అసాధ్యాన్ని సీఎం కేసీఆర్‌ చేసి చూపించారు..!  కేసీఆర్ చేసేదే చెప్తారు… చెప్పిందే చేస్తారు..! ఇదీ తెలంగాణ ప్రజల గుండె లోతుల్లో నాటుకుపోయిన విశ్వాసం.

రాదనుకున్న రాష్ట్రాన్ని తీసుకొచ్చారు..! దుస్సాధ్యం అనుకున్న ఉచిత కరెంటును అమలు చేశారు..! బంగారు తెలంగాణ పథంలో సాగుతున్న పాలనలో ఎన్నో అద్భుతాలు చేసి చూపారు..! అదే స్ఫూర్తితో ముస్లిం మైనార్టీలకు, గిరిజనలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు..! జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపు అనివార్యమన్నారు..! సామాజికి న్యాయం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని  ప్రజలు నమ్ముతున్నారు కానీ… విపక్ష నాయకులు మాత్రం విస్మయం వ్యక్తం చేస్తున్నారు..! అసాధ్యమని కొట్టి పారేస్తున్నారు, ప్రజల విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నారు..! సుప్రీం కోర్టు తీర్పు అడ్డుగోడగా ఉన్న రిజర్వేషన్ పెంపు అంశం అసాధ్యమంటున్నారు..! కానీ రిజర్వేషన్ల పెంపు విషయంలో వెనకుడుగు వేసే ప్రశ్నే లేదని సీఎం కేసీఆర్‌ కుండ బద్దలు కొట్టారు..! ఇందుకు సంబంధించి పార్లమెంటులో బిల్లు తీసుకొచ్చేంత వరకు పోరాడుతామని, సుప్రీంకోర్టులో న్యాయపోరాటమైనా చేస్తామని ప్రకటించారు..! ఏ విశ్వాసంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామో… అదే రీతిలో రిజర్వేషన్లు సాధిస్తానని నిండు సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు..!

గెలుస్తామన్న నమ్మకం మనిషిని విజయం వైపు నడిపిస్తుంది..! సీఎం కేసీఆర్ ఆత్మవిశ్వాసమే ఇప్పుడు రిజర్వేషన్ల పెంపు అంశానికి దేశమంతా మద్దతు పలుకుతోంది..!  ఒక్క మాటలో చెప్పాలంటే రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనన్న సీఎం కేసీఆర్ మాటనే దేశమంతా చెబుతోంది..! అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ ప్రశంసల కురిపించారు..! మైనార్టీలు, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేసీఆర్‌ న్యాయమైన డిమాండ్‌కు అండగా నిలిచారు..! రిజర్వేషన్లు అమలు చేసుకునే హక్కు రాష్ట్రాలకే ఉండాలన్న సీఎం కేసీఆర్ వాదనకు మద్దతు పలికారు..! ఈ విషయంలో జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్‌ ఎలాంటి పోరాటం తలపెట్టినా డీఎంకే అండగా ఉంటుందని ప్రకటించారు..! రిజర్వేషన్ల పెంపుపై సీఎం కేసీఆర్ ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తరపున స్టాలిన్ సంఘీభావం ప్రకటించారు..! సామాజిక న్యాయం కోసం సీఎం కేసీఆర్‌ కృషి ఆదర్శనీయమని పేర్కొంటూ స్టాలిన్ లేఖ రాశారు..! రిజర్వేషన్ల పెంపు అంశంపై మద్దతుగా నిలిచిన స్టాలిన్‌కు సీఎం కేసీఆర్ ఫోన్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు గుజరాత్ ఎన్నికల ప్రచారంలోనూ రిజర్వేషన్ల పెంపు అంశం చర్చనీయాంశమైంది..! ముస్లిం మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలన్న సీఎం కేసీఆర్‌ ఆకాంక్షకు బలం చేకూరుస్తూ… కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనని స్పష్టం చేశారు. మైనార్టీలు, గిరిజనుల సంక్షేమం కోసం వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లుండాలన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అన్నారు. స్టాలిన్, రాహల్ గాంధీ వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది..! ముస్లిం మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు న్యాయమేనన్న డిమాండ్‌కు బలం చేకూరుతోంది.

లౌకిక రాజ్యమైన మన దేశంలో అనేక మతాలు, కులాల వారున్నారు. అన్ని వర్గాల్లోనూ పేదలున్నారు. తరతరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న అణగారిన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడమే రిజర్వేషన్ల పరమార్థం. అదే రాజ్యాంగ స్పూర్తి. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు ప్రస్తుతం రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపు అన్నది న్యాయమైన డిమాండ్. అందుకు సహేతుకమైన కారణాలున్నాయి.  ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం చెబుతున్నది. కానీ తెలంగాణలో ఎస్సీలకు మినహా మిగ తా వర్గాలకు వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు అమలు కావడం లేదు. 9 శాతమున్న ఎస్టీలకు 6 శాతం, 12 శాతమున్న ముస్లింలకు 4 శాతం మాత్రమే రిజర్వేషన్ అమలవుతున్నది.  కాబట్టి అనివార్యంగా వారి రిజర్వేషన్ శాతాన్ని పెంచితీరాలి. ఈ నేపథ్యంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ రాష్ట్రానికి వర్తించదు. ఎస్టీలు అధిక శాతం ఉన్న ఈశాన్య రాష్ర్టాలైన అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ర్టాల్లో 80 శాతం రిజర్వేషన్ అమలవుతున్నది. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దనే సుప్రీం ఆదేశాలు ఆ రాష్ర్టాలపై ప్రభావం చూపట్లేదు. ఇక తమ రాష్ట్రంలో 87 శాతం మంది బలహీనవర్గాలే అని తమిళనాడు వాదించింది. కాబట్టి 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసుకుంటామని చట్టం చేసి, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా పొందింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాంటప్పుడు తెలంగాణలోనూ రిజర్వేషన్లు పెంచడమే న్యాయమన్నది సీఎం కేసీఆర్‌ బలమైన వాదన.

ఒక వైపు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీకోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు వివక్షకు, అణిచివేతకు గురైన వర్గాలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి పరిమితులు లేవని ఆర్టికల్ 46 స్పష్టం చేస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రిజర్వేషన్ల పెంపు అవసరాన్ని గట్టిగా చెబుతూ, పెంపుదలను సాధిస్తామనే విశ్వాసం కూడా ప్రకటించారు. కేసీఆర్ ధీమా వెనుక బలమైన పునాదే ఉన్నదని దేశమంతా నమ్ముతోంది. నిస్వార్థమైన, న్యాయమైన సీఎం కేసీఆర్ ఆకాంక్ష ఫలించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.