సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనుల ప్రారంభం

సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనులు ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వీటిలో ఒకటి వచ్చే నెలలో తానే స్వయంగా ప్రారంభిస్తానని చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి కాలరీస్‌లో నూతన బొగ్గు గనుల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. 12 గనుల్లో ఆరు అండర్ గ్రౌండ్ మైన్స్ కాగా, మిగతావి ఓపెన్ కాస్ట్ గనులు అని ముఖ్యమంత్రి చెప్పారు. సింగరేణిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కేంద్రాలను మూడు చోట్ల పెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. సింగరేణిలో కొత్తగా 12 వేల ఉద్యోగాలను కల్పిస్తున్నామన్న సీఎం.. ఇప్పటికే కొంతమందిని రిక్రూట్ చేసుకున్నామని వివరించారు. సింగరేణి కార్మికులను అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు.