సరి-బేసికి మోకాలడ్డిన గ్రీన్ ట్రైబ్యునల్

ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తప్పుబట్టింది. ఈ నెల 13 నుంచి 17 వరకు సరి–బేసి విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనమేంటో తెలపాలంటూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. సుప్రీంకోర్టు సూచించిన మార్గాలను అమలు చేయని సర్కారు.. సరి –బేసి ఫార్ములాతో ఏం సాధిస్తుందో చెప్పాలని కోరింది. సుప్రీంకోర్టు సూచనల్ని అమలు చేసేందుకు ఏడాది సమయం సరిపోలేదా అని ప్రశ్నించిన ఎన్జీసీ.. ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించింది.

నాలుగు రోజులుగా ఢిల్లీలో విపరీతంగా పెరిగిన కాలుష్యాన్ని నియంత్రించేందుకు మళ్లీ సరి-బేసి విధానం అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం వాహనం నంబరులో సరి సంఖ్య ఉన్నవి ఒకరోజు, బేసి సంఖ్య ఉన్నవి మరోరోజు రోడ్డుపైకి రావాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రతిరోజు సగం వాహనాలు రోడ్డుపైకి రాకుండా నిలువరించవచ్చు.