షీ టీమ్స్ వల్ల మహిళలపై వేధింపులు తగ్గినయ్

మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని పలు సర్వేలు తేల్చాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో షీ టీమ్స్ ఏర్పాటు ద్వారా ఈవ్ టీజింగ్, ఈవ్ టీజర్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు గొంగిడి సునిత, శోభ అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి సమాధానమిచ్చారు. మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన షి టీమ్స్ ను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 210 షీ టీమ్స్ పని చేస్తున్నాయని, ఒక షీ టీమ్‌లో ఐదుగురు సభ్యులు ఉంటారని హోంమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 4,260 మందిని ఈవ్ టీజింగ్ కేసు కింద అరెస్ట్ చేశామని, 9743 మంది యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చామని వివరించారు. ఆత్మరక్షణ కోసం యువతులకు శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈవ్ టీజర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నామని, సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్ట్ చేస్తారని మంత్రి వెల్లడించారు.

బస్ స్టాప్స్, విద్యాసంస్థల ప్రదేశాల్లో షీ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. పూనం మాలకొండయ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. షీ టీమ్స్‌తో మహిళలపై వేధింపులు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు. గృహ హింసను అరికట్టేందుకు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.